ఈ ‘అమ్మ’ల కష్టాలను తీర్చేవారు లేరా?

15 Nov, 2018 15:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వారు తల్లికాని తల్లులు. ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మలు. పాఠాలు చెప్పే పంతులమ్మలు. వారే అంగన్‌వాడి కార్యకర్తలు. పట్టణ ప్రాంతాల్లో ఏమోగానీ పల్లె ప్రాంతాల్లో వారంటే తెలియని వారు ఎవరుండరు. పిల్లలకు వేలకింత ముద్ద పడేయలేని, వారిని బడికి పంపలేని, కూలి నాలి చేసుకొని బతికే పేద ప్రజలు ఎంతో మంది తమ పిల్లలను అంగన్‌వాడిలో వదిలేసి వెళతారు. వారందరికి ఆపద్బంధువు అంగన్‌వాడి కార్యకర్తలే. సకాలంలో నిధులు అందకపోయినా  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం సజావుగా అమలవుతుందంటే అది వారి సామాజిక సేవా దృక్పథం, వృత్తి పట్ల వారికున్న అంకిత భావం కారణం. వారు నెలవారిగా అందుకునే గౌరవ వేతనం అతి తక్కువే అయినా, అదీ రెండు, మూడు నెలలకోసారి అందుతున్నా వారిలో అంకిత భావం చెక్కు చెదరడంలేదు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నెలవారిగా రావాల్సిన రేషన్‌ సరుకులు ఆర్నెళ్లకోసారో, ఏడాదికోసారో వచ్చినా సర్దుకుపోతున్నా, చేతి నుంచి డబ్బులు ఖర్చుపెట్టి పేద పిల్లలకు పౌష్టికాహారం సకాలంలో సరఫరా చేస్తున్న సామాజిక కార్యకర్తలు వారు.

ఒక్కో అంగన్‌వాడి కార్యకర్త 25 నుంచి 30 మంది పేద పిల్లల సంరక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. వారందరికి పౌష్టికాహారం అందించడంతోపాటు వారిలో ఎవరికి జబ్బు చేసినా సమీపంలోని సర్కారు దవఖానాకు స్వయంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారంలో ఆరు రోజులు పనిచేయాల్సిందే. అద్దె తక్కువగా ఉండాలి కనుక చిట్టి గదిలోనో, చీకటి కొట్టులోనో, రేకుల షెడ్డులోనో అంగన్‌వాడి కేంద్రాలు పనిచేస్తాయి. ముంబైలోని ధారవి మురికి వాడలో కూడా 50 చదరపు మీటర్ల ఓ చిట్టి గదిలో ‘శివశక్తి చావల్‌ అంగన్‌వాడి’ని రేఖా భాగ్లే నిర్వహిస్తున్నారు. ఆమెకు హేమా కదమ్‌ సహాయకారి (హెల్పర్‌)గా పనిచేస్తోంది. ఆ గది అద్దె నెలకు 750 రూపాయలు.

సమగ్ర శిశు అభివద్ధి కింద వారు అనేక విధులను నిర్వహించాల్సి ఉంటుంది. శిశువులకు, గర్భవతులకు పౌష్టికాహార పొట్లాలను పంచాలి. వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఆదివాసీ మహిళలకు పిల్లల పోషణ గురించి వివరించి చెప్పాలి. గర్భవతి స్త్రీలతోపాటు ఆరేళ్ల లోపు పిల్లలకు వేడి వేడి అన్నం వండి వడ్డించాలి. 25 నుంచి 30 మంది పిల్లలకు ప్రాథమిక విద్యను బోధించాలి. శివశక్తి చావల్‌ అంగన్‌వాడికి ఉదయం పదింటికల్లా 25 నుంచి 30 మంది పిల్లలు వస్తారు. వారు సాయంత్రం మూడున్నర గంటలకు వెళ్లిపోతారు. ఆ తర్వాత రేఖా భాగ్లే, హేమా కదమ్‌లు బండెడు రిజిస్టర్లు రాయడానికి రోజూ రెండు, మూడు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంటికెళుతూ తమ ప్రాంతంలోని పేద గర్భవతి స్త్రీల ఆరోగ్యం గురించి వాకబు చేసి వెళతారు. అంగన్‌వాడి కార్యకర్తగా రేఖా భాగ్లేకు నెలకు ఏడు వేల రూపాయల గౌరవ వేతనం లభిస్తుండగా, హెల్పర్‌ హేమకు నెలకు మూడున్నర వేల రూపాయలు లభిస్తుంది. ఈ ఏడు వేల రూపాయల్లో కేంద్రం మూడు వేల రూపాయలను కనీస గౌరవ వేతనంగా నిర్దేశించింది. అందులో కేంద్రం 60 శాతం వేతనాన్ని భరిస్తుండగా రాష్ట్రం 40 శాతం భరిస్తోంది. కేంద్రం నిర్దేశించిన కనీస వేతనానికి మించి చెల్లించే రాష్ట్రాలు ఆ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీలకు కేంద్రం నిర్దేశించిన కనీస గౌరవ వేతనం మూడు వేల రూపాయలను, నాలుగున్నర వేల రూపాయలను పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చాలా గొప్పగా ప్రకటించారు. పెంచిన సొమ్మును కూడా అక్టోబర్‌ నెల నుంచే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దష్ట్యా ప్రకటించారు. అయితే మోదీ ప్రకటన రేఖా భాగ్లే లాంటి అంగన్‌వాడీలను ఏమాత్రం ఆకట్టులేక పోయింది. కేంద్ర ఏడవ వేతన సంఘం నిర్ధేశించిన కనీస కార్మిక వేతనం 18 వేల రూపాయలను తమకు కూడా అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా అంగన్‌వాడీలకు భిన్న గౌరవ వేతనాలు ఉన్నాయి. హర్యానాలో నెలకు 11,400 రూపాయలు, తెలంగాణలో 10,500 రూపాయలు, కేరళ 10,000 రూపాయలు చెల్లిస్తుండగా, అన్ని రాష్ట్రాలకన్నా తక్కువగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 4,000 రూపాయలను చెల్లిస్తోంది.

చిల్లర డబ్బులను పెంచడం కన్నా హర్యానా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనం 11,400 రూపాయలను అన్ని రాష్ట్రాలకు వర్తింపచేసి ఉండాల్సిందని అభిల భారత అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ సింధూ వ్యాఖ్యానించారు. ఈ సంఘం సీపీఎంకు అనుబంధంగా పనిచేస్తోంది. కనీస వేతనాన్ని నెలకు 18వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ ఐదవ తేదీన ఢిల్లీలో నిర్వహించిన ‘కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్శ్‌ ర్యాలీలో’ లక్షలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 28 లక్షల మంది అంగన్‌వాడి కార్యకర్తలుంటే 11 లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ‘అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ ఆక్టివిస్ట్‌ (ఏఎస్‌హెచ్‌ఏ)’ను ఆశాగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో ఓ ప్రసవం చేసినందుకు 200 రూపాయలు, శిశువుకు టీకా వేయించినందుకు వంద రూపాయల చొప్పున ఆశా కార్యర్తలకు రాయితీగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాలను మోదీ రెండింతలు చేశారు.

మరిన్ని వార్తలు