‘అమ్మ’ పథకాల అమలుపై ఆగ్రహం

11 Apr, 2019 15:46 IST|Sakshi
ప్రతీకాత్మక​ చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత 1991, జూన్‌ 24వ తేదీన మొదటి సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఆ రాష్ట్రానికి రెండో మహిళా ముఖ్యమంత్రి. ఆమెకన్నా ముందు ఆమె రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్‌ భార్య జానకి రామచంద్రన్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఓ నెలరోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. 1991 నుంచి 2016లో ఆమె చనిపోయే వరకు ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారంటే అందుకు ప్రధాన కారణం ఆమె ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కారణం. 

తమిళనాడులో ఆడ శిశు హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో జయలలిత 1992లో ‘క్రేడిల్‌ బేబీ స్కీమ్‌’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక కేంద్రాలు, పిల్లల సంరక్షణాలయాల్లో ఊయలలను ఏర్పాటు చేశారు. ఆడ శిశువులు అవసరం లేదనుకున్న తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చి వాటిలో వేసి పోవచ్చు. ఆ తర్వాత ఆ ఆడ శిశువులను అవసరం మున్న దంపతులకు దత్తత ఇచ్చేవారు. లేదంటే  ప్రభుత్వ పిల్లల సంరక్షణాలయాల్లో చేర్చేవారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన తర్వాత జయలలిత దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు ఉచితంగా మిక్సర్‌ గ్రైండర్స్, ఫ్యాన్స్‌ పంపిణీ చేశారు. ఆమె అదే ఏడాది వద్ధులు, వితంతువుల పింఛన్లను పెంచారు. 

2013, ఫిబ్రవరి నెలలో ఆమె ‘అమ్మ క్యాంటీన్లు’ స్కీమ్‌ను ప్రారంభించారు. రూపాయికి ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, ఐదు రూపాయలకు సాంబార్‌ అన్నం చొప్పున నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయడం వల్ల ఈ క్యాంటీన్లకు అమితమైన ప్రజాదరణ వచ్చింది. 2014లో ‘అమ్మ బేబీ కేర్‌ కిట్‌’ అనే స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన పిల్లలకు 16 వస్తువులతో కూడిన వెయ్యి రూపాయల కిట్‌ ఇచ్చేవారు. వాటిలో సబ్బు, టవల్, నేల్‌కట్టర్, దోమతెర, ఓ బొమ్మ లాంటివి ఉండేవి. 2015లో అంతర్జాతీయ తల్లి పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని జయలలిత, రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లలో 350 తల్లి పిల్లలకు పాలివ్వడానికి అనువైన గదులను ఏర్పాటు చేశారు.

అదే సంవత్సరం ‘అమ్మ ఆరోగ్య పథకం’ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద 30 ఏళ్ల లోపు వారికి ఈ స్కీమ్‌ కింద ఉచిత వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. మహిళలకైతే డీ విటమన్‌ స్థాయి, బోన్‌ సాంద్రత, పరథ్రాయిడ్‌ లాంటి ప్రత్యేక పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించేవారు. తమిళనాడులో 1962లో వద్ధాప్య పింఛన్లను ప్రవేశపెట్టారు. 1975లో దాన్ని వితంతువులకు కూడా వర్తింపచేశారు. 2011లో ఆ పింఛన్లను జయలలిత ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచింది. ఆ పింఛన్లను 1500 రూపాయలకు పెంచుతామని 2016 ఎన్నికల ప్రణాళికలో జయలలిత ప్రకటించారు. దాన్ని అమలు చేయకముందే ఆమె మరణించారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రులైనవారుగానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల జయలలిత ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఇది ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి ప్రతికూల అంశం. ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలతోపాటు రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. 234 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 114 మంది సభ్యుల మద్దతు కలిగిన (స్పీకర్‌ మినహా) పాలకపక్షానికి ఉప ఎన్నికలు కీలకమే!

మరిన్ని వార్తలు