సుప్రీంను ఆశ్రయించిన అనిల్, టీనా అంబానీ

22 Jul, 2013 11:55 IST|Sakshi
సుప్రీంను ఆశ్రయించిన అనిల్, టీనా అంబానీ

2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై రిలయన్స్ ఏడీఏ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ సుప్రీంకోర్టను ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.  బుధవారం వాదనలు విననుంది.

ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులుగా తమ ముందు హాజరుకావాల్సిందిగా అనిల్ దంపతులతో పాటు మరో 11 మందిని సీబీఐ కోర్టు శుక్రవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాస్తవాల నిర్ధారణకు వీరి విచారణ అవసరమని తాను భావించినట్లు సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన దరఖాస్తును అనుమతిస్తూ మొత్తం 13 మందికి సమన్లు జారీ చేశారు.


ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న స్వాన్ టెలికం ప్రైవేట్ లిమిటెడ్‌లో రిలయన్స్ ఏడీఏ రూ.990 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందనే ఆరోపణల నేపథ్యంలో అనిల్‌కు, అతని కంపెనీ ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయంకాలకు సమన్లు జారీ చేయాల్సిందిగా సీబీఐ విజ్ఞప్తి చేసింది. కంపెనీ చైర్మన్‌గా అనిల్ ఈ పెట్టుబడుల విషయంలో సమాచారం ఇవ్వగలరని భావిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. చెక్కుల జారీపై అనిల్ దంపతులకు అపరిమిత అధికారాలున్నాయని, పెట్టుబడులకు సంబంధించి జరిగిన సమావేశాలకు టీనా అంబానీ అధ్యక్షత వహించారని సీబీఐ తెలిపింది.

>
మరిన్ని వార్తలు