కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా అనిల్ గోస్వామి

30 Jun, 2013 21:59 IST|Sakshi
Photo courtesy: PTI

కేంద్ర హోం శాఖ నూతన కార్యదర్శిగా జమ్ము కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ గోస్వామి(58) ఆదివారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు, ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ హోం సెక్రటరీ పదవికి గోస్వామి పేరును ఆమోదించింది. 1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గోస్వామి జమ్ము నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి అధికారి కావడం విశేషం.

2015, జూన్ వరకు సుమారు రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈయన హయాంలోనే 2014 సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం గమనార్హం. హోం శాఖలో ఇప్పటి వరకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా గోస్వామి బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా గతంలో జమ్ము కాశ్మీర్, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ అత్యున్నత స్థాయి బాధ్యతల్లో తనదైన శైలిలో రాణించారు.

గతంలో జమ్ము కాశ్మీర్ సీఎంగా ఉన్న గులాం నబీ ఆజాద్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. తాజాగా హోం సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన గోస్వామి, ఉత్తరాఖండ్‌లో వరద బాధితులకు అందుతున్న సాయంపై తక్షణ దృష్టిని కేంద్రీకరించారు. ఇదిలావుంటే, ఇప్పటి వరకు హోం శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్ కే సింగ్ ఆదివారం పదవీ విరమణ పొందారు.

మరిన్ని వార్తలు