కేంద్రం సవరణ.. జల్లికట్టుపై మళ్లీ టెన్షన్‌!

15 Dec, 2017 08:46 IST|Sakshi

సాక్షి, చెన్నై : జల్లికట్టు ఆటపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 1960 యానిమల్స్‌ యాక్ట్‌ను సవరించటంతో వచ్చే సంక్రాంతికి ఈ పోటీల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు వెల్లడించింది. 

కేంద్ర సవరణతో ఒక్క జల్లికట్టు మాత్రమే కాదు.. రెక్లా(ఎండ్ల బండ్ల పోటీలు) కూడా నిర్వహించుకోవచ్చని అడ్వొకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ డివిజన్‌ బెంచ్‌కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే (వచ్చే నెల 7న తేదీ ఆ ప్రాంతంలో) నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

పెటా పిటిషన్‌తో మార్చి 7, 2014న సుప్రీంకోర్టు ఈ ఆటలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమిళనాడు ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. వారికి సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. 

ఆందోళన తీవ్రం కావడంతో కేంద్రం దిగివచ్చింది. 1960 చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో జల్లికట్టు నిర్వాహకుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. జంతు ప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. కేంద్రం తీరుపై జంతు పరిరక్షణ సంఘం పెటా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు