అన్నా హజారే దీక్ష విరమణ

5 Feb, 2019 20:29 IST|Sakshi

రాలేగావ్‌ సిద్ధి(మహారాష్ట్ర) : అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం దీక్షను విరమించారు. తన డిమాండ్లను నెరవేర్చేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇచ్చిన హామీతో దీక్ష విరమిస్తున్నట్టు అన్నా హజారే ప్రకటించారు. లోకాయుక్త నియామకంపై ఫిబ్రవరి 13న మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దీక్ష విరమణ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ హజారే వెల్లడించారు.

సీఎంతో చర్చలు సంతృప్తికరంగా సాగడంతో తాను సంతోషంగా దీక్ష విరమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. లోక్‌పాల్‌ అమలు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ దిశగా ఈనెల 13న నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. లోకాయుక్త కోసం జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేస్తారని, రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మంగళవారం స్వయంగా అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధి గ్రామానికి చేరుకుని ఆయనతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర స్ధాయిలో లోక్‌పాల్‌, రాష్ట్రాల పరిదిలో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని అన్నా హజారే చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు