లోక్‌పాల్‌ కోసం అక్టోబర్‌ 2 నుంచి నిరశన

30 Jul, 2018 03:41 IST|Sakshi

రాలేగావ్‌ సిద్ధి: లోక్‌పాల్‌ నియామకంపై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా అక్టోబర్‌ 2 నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రకటించారు. అవినీతి రహిత దేశం కోసం తాను చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వస్థలమైన రాలేగావ్‌ సిద్ధిలో మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్‌ 2 నుంచి నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు.

అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ఎన్డీయే సర్కారుకు లేదని, అందుకే లోక్‌పాల్‌ నియామకంపై కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. లోక్‌పాల్‌ బిల్లు అమలుతో పాటు సత్వరమే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీయే, ఇప్పడు దానిని విస్మరించిందని ఆరోపించారు. లోక్‌పాల్‌ చట్టం తేవాలని డిమాండ్‌ చేస్తూ 2011లో 12 రోజులపాటు అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు 2014లో లోక్‌పాల్‌ చట్టాన్ని తెచ్చింది.  

మరిన్ని వార్తలు