హరియాణాలో మరో దారుణం

23 Oct, 2015 11:50 IST|Sakshi

చండీఘడ్: హరియాణాలో  దళిత కుటుంబంపై దాడి, ఇద్దరు చిన్నారుల హత్య  మరవకముందే రాష్ట్రంలో  మరో దళిత బాలుడి మరణం కలకలం రేపింది.  పావురాలు దొంగిలించాడనే  నెపంతో విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ మైనర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

వివరాల్లోకి  వెళితే గొహనా గ్రామానికి చెందిన గోవింద(14) పై  ... యింట్లో పావురాలు ఎత్తుకెళ్లాడని  పొరుగువారు  బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.  ఏం జరిగిందో తెలియదు కానీ మరునాడు ఉదయానికి  గోవింద శవమై తేలాడు. పోలీస్ స్టేషన్ కు  సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు.  కాగా బాలుడు పోలీస్ స్టేషన్ లో ఉరి వేసుకుని చనిపోయినట్లు కేసు నమోదు అయింది.

అయితే  పోలీసులే తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని  గోవింద కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  తమ కుమారుడిని విడిచిపెట్టడానికి పదివేల  రూపాయల లంచం తీసుకుని, తమ బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ  ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు.  మృతుని బంధువులు నిరసన చేపట్టినా అధికారులెవ్వరూ  స్పందించకపోవడంతో తమ ఆందోళనను  మరింత ఉదృతం చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ పట్టాలపై  సుమారు మూడుగంటల పాటు ధర్నా నిర్వహించారు.  

దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్రం అంతరాయం కలిగింది.   ఈ ఉద్రిక్త పరిస్థితుల  నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.  సంబంధిత పోలీసు అధికారులపై హత్యానేరం కింద నమోదు చేశారు.  మృతుని సోదరుని ఫిర్యాదుతో ఎస్ఐ, ఎఎస్ఐలు  సుభాష్, అశోక్ లపై కేసు నమోదు చేశామని డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు