సముద్రంలో మరో శకలం

23 Mar, 2014 04:46 IST|Sakshi

మలేసియా విమానానిదని అనుమానం..

 రెండు వారాల క్రితం అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్370 ఆచూకీ కోసం ఆరు విమానాలు, ఆరు నౌకలతో 36 వేల చ .కి.మీ. విస్తీర్ణంలో విస్తృత గాలింపులు జరిపినా శనివారం దాకా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది. అయినా 26 దేశాల బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా రెండు శకలాలను గుర్తించడంతో వాటికోసం శుక్రవారం అన్వేషించినా.. జాడ దొరకలేదు. దీంతో అవి సముద్రంలో మునిగిపోయి ఉంటాయని భావించారు.


అయితే హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా శకలాలను గుర్తించిన ప్రాంతానికి నైరుతి దిశగా 120 కి.మీ. దూరంలో మరో వస్తువును మంగళవారం చైనా ఉపగ్రహం గుర్తించినట్లు శనివారం మలేసియా రక్షణ, రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ప్రకటించారు. 22.5 మీ. పొడవు, 13 మీ. వెడల్పు ఉన్న ఆ వస్తువు అన్వేషణ కోసం చైనా రెండు నౌకలను పంపుతున్నట్లు తెలిపారు. అయితే విమానం బ్లాక్‌బాక్స్‌లో బ్యాటరీ 30 రోజులే పనిచేస్తుందని, మరో 15 రోజులు దాటితే బ్లాక్‌బాక్స్ నుంచి సంకేతాలు ఆగిపోతాయని హిషాముద్దీన్ తెలిపారు. ఏమాత్రం ప్రయోజనం లేదని భావించేదాకా అన్వేషణ కొనసాగుతుందన్నారు.


విమానం ఆచూకీ కోసం సముద్ర గర్భంలో అన్వేషించేందుకు నిఘా పరికరాలను ఇవ్వాలంటూ అమెరికాను మలేసియా కోరింది. అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్‌కు మలేసియా రక్షణ మంత్రి ఫోన్‌లో విజ్ఞప్తి చేయగా.. తమ టెక్నాలజీని, పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు