మృత్యుశిఖరంగా మారుతున్న ఎవరెస్ట్

27 May, 2016 19:25 IST|Sakshi
మృత్యుశిఖరంగా మారుతున్న ఎవరెస్ట్

ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాలన్న పట్టుదల చివరకు ఆయన ప్రాణాలనే బలిగొంది. 58 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి వారం క్రితం కనపడకుండా పోయిన పరేష్ చంద్రనాథ్ మరణించారు. ఆయన మృతదేహం శుక్రవారం కనిపించింది. ఆయనలాగే అదృశ్యమైన మరో భారతీయ పర్వతారోహకుడి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరుగురు షేర్పాల బృందం ఒకటి పరేష్ చంద్రనాథ్ మృతదేహాన్ని కనుగొన్నట్లు ట్రెక్కింగ్ క్యాంప్ నేపాల్ డైరెక్టర్ వాంగ్చూ షేర్పా తెలిపారు. గౌతమ్ ఘోష్ అనే మరో పర్వతారోహకుడి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని బహుశా ఆయన మృదేహం 8వేల మీటర్ల ఎత్తున ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు.

గాలులు చాలా వేగంగా వీస్తుండటంతో పరేష్ నాథ్ మృతదేహాన్ని కనుగొన్న తర్వాత నాలుగో క్యాంపు నుంచే రెస్క్యూ టీమ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఘోష్ మృతదేహాన్ని వేరే కొంతమంది పర్వతారోహకులు చూసినట్లు చెబుతున్నారు. గత శనివారం పరేష్ నాథ్, ఘోష్ ఇద్దరూ 8848 మీటర్ల ఎత్తయిన శిఖరం వద్ద ఉన్నారు. ఆ తర్వాత బృందంలోని మిగిలిన నలుగురు సభ్యులకు, వీరికి కమ్యూనికేషన్ తెగిపోయింది. ఈసారి ఎవరెస్ట్ పర్వతారోహణ సీజన్‌లో ఐదుగురు మరణించారు. గత శుక్ర, శనివారాల్లో డచ్, ఆస్ట్రేలియన్ మహిళలిద్దరు ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే అనారోగ్యంతో మరణించారు. ఒక నేపాలీ గైడ్ 2వేల మీటర్ల ఎత్తు నుంచి జారి పడిపోయి మరణించారు. కొన్ని రోజుల క్రితం మరో భారతీయుడు కూడా ఎవరెస్ట్ మీద మరణించారు.

మరిన్ని వార్తలు