కంబాళ: మరి ఈ జాకీని ఏమని పిలవాలో!

18 Feb, 2020 15:00 IST|Sakshi
నిశాంత్‌ శెట్టీ

‘కంబాళ’లో మరో రికార్డు వేగం నమోదు

సాక్షి, బెంగుళూరు : కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబాళలో 30 ఏళ్ల రికార్డు తిరగరాసిన శ్రీనివాస గౌడను ఉసేన్‌ బోల్ట్‌తో పోల్చాం. మరి శ్రీనివాస గౌడ రికార్డు తిరగరాసిన నిశాంత్‌ శెట్టీనీ ఏమని పిలవాలో..! అవును, వేనూర్‌లో ఆదివారం జరిగిన కంబాళ క్రీడలో బజగోళి జోగిబెట్టుకు చెందిన ఈ నయా కంబాళ జాకీ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకండ్లలో పరుగెత్తాడు. దీనిని 100 మీటర్లకు లెక్కించినపుడు.. ఉసేన్‌ బోల్ట్‌ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డు వేగాన్ని మించిన వేగం నమోదైనట్టే. అంటే బోల్ట్‌ కంటే 0.07 సెకండ్లు వేగంగా నిశాంత్‌ పరుగు పూర్తి చేశాడు.


(చదవండి: ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!)


ఇక కన్నడనాట వారం క్రితం జరిగిన ఇదే ‘కంబాళ’ క్రీడలో శ్రీనివాస గౌడ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు వేగానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. పంట పొలాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీనివాస్‌ గౌడకు ట్రైనింగ్‌ ఇస్తే గొప్ప అథ్లెట్‌ అవుతాడని ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌ చేయడం.. దానికి క్రీడల మంత్రి కిరన్‌ రిజుజు స్పందించి  అతనికి సాయ్‌ నుంచి ఆహ్వానం పంపుతామని బదులివ్వడం తెలిసిందే. ఇక శ్రీనివాస గౌడ రికార్డును తిరగరాసిన నిశాంత్‌కు ఎలాంటి ఆహ్వానం అందుతుందో చూడాలి..!
(చదవండి : కంబాల రేసర్‌కు సాయ్‌ పిలుపు!)

వాటి వల్లే ఈ విజయం.. 
శ్రీనివాస గౌడపై ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి యడియూరప్ప రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 లక్షల నదగు బహుమతి కూడా అందించడం విశేషం. అయితే, సీఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాడ్లాడిన శ్రీనివాస్‌ గౌడ తన విజయంలో దున్నపోతుల పాత్రే కీలకమని అన్నాడు. అవి వేగంగా పరుగెత్తడం వల్లే తాను అంతే వేగంగా దూసుకెళ్లానని చెప్పుకొచ్చాడు. చెప్పులు లేకుండా.. పంట పొలాల్లో పరుగెత్తడం తెలిసిన తనకు వేరే ఆటలేవీ వద్దని అన్నాడు. అనుభవం లేని కారణంగానే పెద్దల సూచనల్ని కాదంటున్నానని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు