పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు మరో షాక్‌!!

7 Jul, 2019 15:17 IST|Sakshi

రూ. 3,805 కోట్లు మోసం చేసిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ 

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ ఫ్రాడ్‌ నుంచి తేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)కి మరో షాక్‌ తగిలింది. తాజాగా దివాలా తీసిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ (బీపీఎస్‌ఎల్‌) సంస్థ దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. ఖాతాల్లో అంకెల గారడీతో బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందిన బీపీఎస్‌ఎల్‌.. ఆ నిధులను దుర్వినియోగం చేసిందని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైనట్లు పీఎన్‌బీ పేర్కొంది.

‘ఫోరెన్సిక్‌ ఆడిట్‌ విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన నిధుల మళ్లింపు అభియోగాలతో బీపీఎస్‌ఎల్, దాని డైరెక్టర్లపై సీబీఐ సుమోటో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీన్ని ఆర్‌బీఐకి నివేదించాం‘ అని పేర్కొంది. అయితే, ఈ ఖాతాకు సంబంధించి నిబంధనల ప్రకారం ఇప్పటికే రూ. 1,932 కోట్ల మేర కేటాయింపులు జరిపినట్లు పీఎన్‌బీ తెలిపింది. బీపీఎస్‌ఎల్‌ దేశీయంగా చండీగఢ్‌లోని పీఎన్‌బీ కార్పొరేట్‌ బ్రాంచ్‌ నుంచి రూ. 3,192 కోట్లు, విదేశీ శాఖల (దుబాయ్, హాంకాంగ్‌) నుంచి రూ.614 కోట్లు రుణాలుగా తీసుకుంది.

ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్‌ఎల్‌ కేసు విచారణ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్‌బీ వివరించింది. వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరులు పీఎన్‌బీని దాదాపు రూ. 13,500 కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే.  

>
మరిన్ని వార్తలు