'మరోసారి దేశ విభజన తప్పదేమో!'

16 Mar, 2016 20:20 IST|Sakshi
'మరోసారి దేశ విభజన తప్పదేమో!'

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి దేశ విభజన తప్పదేమోనని బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. వలస కార్మికులు లక్ష్యంగా దాడులు జరుగుతుండటాన్ని ఆమె సభలో ప్రస్తావించారు.

'మన దేశం మరోసారి చీలిపోవచ్చు. అయితే ఈసారి విదేశీయుల వల్ల కాదు స్వదేశీయుల వల్ల ఇది జరుగుతుంది. మతం, కులం, భాష ఆధారంగా విభజన ఏర్పడుతున్నది' అని ఎస్పీ ఎంపీ అయిన ఆమె బుధవారం రాజ్యసభలో పేర్కొన్నారు. 'ఉపాధి, ఉద్యోగాల కోసం ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళుతుంటారు. అక్కడి భాష మాట్లాడనందుకు వారికి ఉద్యోగాలు దొరకడం లేదు. అంతేకాకుండా వారిని బెదిరిస్తున్నారు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో మరాఠేతరులకు ఆటోరిక్షా పర్మిట్లు ఇస్తే.. ఆ ఆటోలను తగలబెడతామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్‌ ఠాక్రే బెదిరించిన నేపథ్యంలో జయాబచ్చన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు