గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

28 Jul, 2017 01:19 IST|Sakshi

అహ్మదాబాద్‌: రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇటీవలే పార్టీని వీడిన శంకర్‌సింగ్‌ వాఘేలాకు సన్నిహితులుగా భావిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు గురువారం తమ అన్ని పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 54కి తగ్గిపోయింది.

ఆగస్టు 8న జరిగే రాజ్యసభ ఎన్నికలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు అహ్మద్‌పటేల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను గాంధీనగర్‌లో అసెంబ్లీ స్పీకర్‌ రమణ్‌లాల్‌ వోరాకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో బల్వంత్‌సిన్హ్‌æ రాజ్‌పుత్, తేజశ్రీబెన్‌ పటేల్, ప్రహ్లాద్‌ పటేల్‌ ఉన్నారు. ఆ వెంటనే బల్వంత్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌ను రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తమ మూడో అభ్యర్థిగా బరిలోకి దింపుతామని బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలు కూడా గుజరాత్‌ నుంచి పోటీచేస్తున్నారు.

మరిన్ని వార్తలు