రోహ్‌తక్ అక్కచెల్లెళ్ల మరోసాహసం!

2 Dec, 2014 21:59 IST|Sakshi
రోహ్‌తక్ అక్కచెల్లెళ్లు

చండీగఢ్: హర్యానాలో గత వారం ఓ ఆర్టీసీ బస్సులో తమను వేధించిన ముగ్గురు ఆకతాయిల భరతంపట్టి వీరనారులుగా అందరి ప్రశంసలు అందుకుంటున్న  రోహ్‌తక్ అక్కచెల్లెళ్లు ఇద్దరూ మరో సహసం  చేశారు.  సుమారు నెల కిందట ఇదే తరహాలో పోకిరీలకు బుద్ధిచెప్పిన ఉదంతం తాజాగా బయటపడింది. రోహ్‌తక్‌లోని హుడా పార్కుకు వెళ్లిన ఆ అక్కచెల్లెళ్లను అక్కడ ఓ బల్ల మీద కూర్చున్న కొందరు పోకిరీలు వేధించారు. దీంతో ఆగ్రహించిన అక్కచెల్లెళ్లు పోకిరీలతో వాగ్వాదానికి దిగారు. చివరకు అక్కచెల్లెళ్లలో ఒకరు ఓ ఆకతాయిని చితక్కొట్టింది. దాంతో   మిగిలిన పోకిరీలు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ దశ్యాలను చిత్రీకరించిన పార్కులోని ఓ వ్యక్తి 30 సెకన్ల ఆ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పలు వార్తాచానళ్లు సైతం మంగళవారం ఆ వీడియోను ప్రసారం చేశాయి. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అక్కచెల్లెళ్లను ప్రశ్నించగా, ఆకతాయిలు పారిపోయినందునే కేసు పెట్టలేదన్నారు. అలాగే ప్రచారం కోసమే తాము వీడియోలను బయటపెడుతున్నట్లు వ స్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు.

 అది తప్పుడు కేసు: గ్రామస్తులు
 ఆర్టీసీ బస్సులో అక్కచెల్లెళ్లపై వేధింపులకు పాల్పడిన ఆసన్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అక్కడి గ్రామస్తులంతా వెనకేసుకొచ్చారు. యువకులను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఉదంతంపై మంగళవారం సమావేశమైన వారు ఆ యువకులకు మద్దతు పలకాలని నిర్ణయించారు. బస్సులో సీటు విషయమై అక్కచెల్లెళ్లు, ముగ్గురు యువకుల మధ్య గొడవ తలెత్తిందంటూ వారు మీడియాకు తెలిపారు.

బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్‌తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ నిన్న ప్రకటించారు.
**

మరిన్ని వార్తలు