శబరిమల ప్రవేశానికి మరో మహిళ యత్నం

23 Oct, 2018 03:40 IST|Sakshi

రివ్యూ పిటిషన్ల విచారణ తేదీని నేడు ఖరారు చేయనున్న సుప్రీం

న్యూఢిల్లీ/పంబా: శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు సోమవారం మరో మహిళ విఫలయత్నం చేసింది. బిందు అనే దళిత మహిళా కార్యకర్త వినతి మేరకు పోలీసులు ఆమెను కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వద్దకు తీసుకువచ్చారు. అయితే, అక్కడ పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను జీపులో ఎక్కించుకుని సురక్షిత ప్రాం తానికి తరలించారు. కాగా, సోమవారం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసి వేయనున్న నేపథ్యంలో మరికొందరు మహిళలు ప్రవేశించేందుకు ప్రయత్నించవచ్చనే సమాచారంతో సుప్రీం తీర్పు మేరకు కేరళ సర్కారు ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది.  


సుప్రీంకోర్టులో 19 రివ్యూ పిటిషన్లు
శబరిమల తీర్పుపై దాఖలైన పలు రివ్యూ పిటిషన్ల విచారణ తేదీని నేడు సుప్రీంకోర్టు ఖరారు చేయనుంది. సన్నిధానంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలు ఆందోళన లు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రివ్యూ పిటిషన్లను అత్యవసరమైనవిగా పరిగణించి విచారణ చేపట్టాలంటూ పిటిషన్‌ దాఖలైంది.

మరిన్ని వార్తలు