కుటుంబంతో చూసే సినిమాలేవి?

18 Sep, 2017 02:53 IST|Sakshi
కుటుంబంతో చూసే సినిమాలేవి?

► అలాంటివి వేళ్లపై లెక్కించొచ్చు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
► సామాజిక విలువలతో సినిమాల్లో ఒక్క పాటైనా పెట్టాలి: సీఎం కేసీఆర్‌
► వెంకయ్య చేతుల మీదుగా రాజమౌళికి ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డు ప్రదానం


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఇవాళ ఎన్నో అద్భుతమైన సిని మాలు రూపొందుతున్నా చౌకబారు, మూస సిని మాలు కూడా కొన్ని వస్తున్నాయి. పలువురు దర్శక, నిర్మాతలు తమ సృజనాత్మకతను హింస, నేరాలు, అసభ్యత, డబుల్‌ మీనింగ్‌ డైలాగుల్లో చూపించేందుకు ఉపయోగిస్తున్నారు. సినిమా విజయవంతం కావడమే పరమావధిగా పెట్టుకున్నారు. సినిమాలకు జనాల జీవితమే పరమావధి కావాలి’’ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. హింస, అత్యాచారం, హత్యలు వంటి వాటిని ఎక్కువ చేసి చూపిస్తున్నారని, సినిమా, మీడియా బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు. కుటుంబంతో కలిసి చూసే సిని మాలు ఇప్పుడు వేళ్లపై లెక్కపెట్టొచ్చని, శివాజీ గణే శన్, ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ వంటి నటులు తగ్గిపోయారని అన్నారు. ఏఎన్‌ఆర్‌ నటన తలచుకుంటే మనసు మధురం అవుతుందని కొనియాడారు.

ఆదివారం ఆయన హైదరాబాద్‌ లోని శిల్పకళావేదికలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి ‘ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డు’ను ప్రదానం చేశారు. సన్మాన పత్రం, చెక్కును సీఎం కేసీఆర్‌ అందజే శారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డుతో పెద్ద బాధ్యత నా భుజాలపై పెట్టారని రాజమౌళి అన్నారు. ఈ బాధ్యతని కచ్చితంగా నువ్వు నెరవేర్చగలవు. ఎందుకంటే నువ్వు ‘బాహుబలి’. అంటే ఫిజికల్‌గా కాదు. క్రియేటివిటీ, విజన్‌ పరంగా. ఈ పురస్కారాలు ఎందుకంటే మిగతా వాళ్లకి ఒకరక మైన అభిరుచి, శ్రద్ధ, ఆసక్తి పెంచడం కోసం’’అని అన్నారు. తల్లిపాలు ఎంత శ్రేష్టమో మాతృభాష కూడా అంతే శ్రేష్టమని, తెలంగాణలో తెలుగును తప్పనిసరి చేసిన సీఎంను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

ప్రేక్షకులు మంచిని ఆదరిస్తారు: కేసీఆర్‌
‘‘మనమంతా ఎంతో గర్వపడే ఏఎన్‌ఆర్‌ అవార్డును తెలుగుబిడ్డగా అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన రాజమౌళిగారికి ఈ రోజు అందించడం చాలా సార్థకంగా ఉందని భావిస్తున్నా. ఆయన తక్కువ సినిమాలు తీసినా.. అన్నీ హిట్లే. ‘బాహుబలి’ సినిమా అద్భుత కళాఖండం. దాన్ని ముందు హిందీలో తర్వాత తెలుగులో చూశా. రాజమౌళి తెలుగులో కూడా అధిక బడ్జెట్‌ పెట్టి సినిమాలు తీయొచ్చని ట్రెండ్‌సెట్‌ చేశారు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘ఇంతమంది సినీ పెద్దల సమక్షంలో ఏఎన్‌ఆర్‌ గురించి నేను ఏమని మాట్లాడేది. ఆయన సినిమాలు, అందులోని పాటలు, సాహిత్యం అద్భుతం. పాత ట్రెండ్‌ మారుతోందనే సందర్భంలో ‘శంకరాభరణం’ సినిమా వచ్చింది.

తొలుత పట్టించుకోకున్నా అది మూడు వందల రోజులు ఆడింది. ప్రేక్షకులు మంచిని ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. తెలుగు భాషను మనం కాపాడాలి. సాహిత్యం, సామాజిక విలువలతో కూడిన ఒక్క పాటైనా సినిమాల్లో పెట్టాలని కోరు తున్నా’’ అని అన్నారు. ‘‘ఆ రోజుల్లోనే హైదరాబాద్‌కు ధైర్యంగా వచ్చి అన్నపూర్ణ స్టూడియో కట్టి తెలుగు సినిమా ఇక్కడికి తరలివచ్చేందుకు శ్రీకారం చుట్టిన ఆద్యులు ఏఎన్‌ఆర్‌. ఆ తర్వాత ఎన్టీఆర్, కృష్ణ, రామా నాయుడు, రామోజీరావు స్టూడియోలు కట్టారు’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందన్నారు.

మహాభారతంలో భీష్ముడు.. కలియుగంలో అక్కినేని: రాజమౌళి
అక్కినేనికి 1974లో గుండెపోటు వచ్చినా తన విల్‌పవర్, మనోబలంతో మృత్యువుని చాలెంజ్‌ చేసి ఆపగలిగారని అవార్డు గ్రహీత రాజమౌళి అన్నారు. ‘‘మృత్యువుతో మాట్లాడిన వారిలో మహాభారతంలో భీష్ముడు ఉన్నారు.. కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. అంతటి మహానుభావుడి పేరిట అవార్డుని ఈరోజు నాకు ఇస్తున్నారు. ఆ అవార్డుకి నేను అర్హుడినా అంటే కాదనే చెప్తాను. నా భుజాలపై మరింత భారం మోపుతున్నట్లు ఫీల్‌ అవుతున్నా. నేను ఇంకా కష్టపడాలని గుర్తు చెయ్యడానికి ఈ అవార్డు ఇస్తున్నారని అనుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమం తర్వాత అక్కినేని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫర్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులు వెంకట్, నాగార్జున, నాగసుశీల, సుమంత్, నాగచైతన్య, అఖిల్‌తోపాటు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, కె.ఎల్‌.నారా యణ, జగపతిబాబు, పీవీపీ, ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ, గుణ్ణం గంగరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు