జాతీయ గీతంతో న్యూ ఇయర్‌కు స్వాగతం

1 Jan, 2020 14:05 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో నిరసనకారులు న్యూ ఇయర్‌కు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ముఖ్యంగా డిసెంబర్‌ 31 అర్ధరాత్రి యువత ఎక్కువగా పబ్‌లు, పార్టీలకు సమయం కేటాయిస్తారు.. కానీ అందుకు విరుద్ధంగా దేశ రాజధానిలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తమ నిరసనల్లో భాగంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో జాతీయ గీతం పాడుతూ.. కొత్త ఏడాదిని ఆహ్వానించారు. 

ఇప్పటికే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయినప్పటికీ.. నిరసనలు చలిని ఏ మాత్రం లెక్కచేయకుండా రోడ్లపైకి చేరకున్నారు. వారిలో అధిక సంఖ్యలో మహిళలు ఉండటం గమనార్హం. కొందరు జాతీయ జెండాలు చేతపట్టుకుంటే.. మరి కొందరు సీఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఆజాదీ.. ఆజాదీ అంటూ నినాదాలు చేశారు. అలాగే నిరసనకారులు ఒకరికొక్కరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జాతీయ గీతం పాడటం పూర్తయిన తర్వాత.. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ ముగించారు. ఈ సందర్భంగా పలువరు మహిళలు మాట్లాడుతూ.. సీఏఏ వల్ల తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు