ఫేక్‌ పోస్టులు.. పాక్‌కు దిమ్మతిరిగే షాక్‌

19 Nov, 2017 09:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని భారత్‌పై విషం చిమ్మేందుకు తీవ్రంగా యత్నించింది. ఈ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి బొక్కా బోర్లా పడింది. భారత్‌కు వ్యతిరేకంగా ఫేక్‌ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడంతో పాకిస్థాన్‌ డిఫెన్స్‌ ఫోరమ్‌కు చెందిన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు శనివారం స్తంభించిపోయాయి.  

ఇంతకీ విషయం ఏంటంటే... ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కవాల్‌ ప్రీత్‌ కౌర్ అనే న్యాయ విద్యార్థిని ఈ జూన్‌లో ఓ పోస్టు చేసింది. భారతీయులుగా రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని గౌరవించాలని... ముస్లిం ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించాలంటూ ఫ్లకార్డు మీద రాసి జమా మసీద్‌ వద్ద  ఫోటో దిగి షేర్‌ చేసింది. తనలా ప్రతీ ఒక్కరూ ఇలా ఫోటో దిగి ప్రొఫైల్‌ ఫోటో మార్చుకొండంటూ తెలియజేసింది.  అయితే ఆ ఫోటోను  మార్ఫింగ్ చేసిన పాక్‌ డిఫెన్స్‌ తన అధికారిక పేజీలో షేర్‌ చేసింది. ‘‘నేను ఇండియన్‌ను అయినా.. భారత్‌ అంటే అస్సలు ఇష్టం లేదు.. వలసవాదాలకు ఇది కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిపోయింది’’ అంటూ ఫ్లకార్డులోని రాతలను పూర్తిగా మార్చేసింది. పైగా చివరకు భారతీయులు అర్థం చేసుకున్నారు అంటూ పాక్‌ రక్షణ శాఖ చివర్లో ఓ సందేశం కూడా ఇచ్చింది.

జాదవ్‌ అంశంపై కూడా...

ఇదిలా ఉంటే పాక్‌లో బందీగా ఉన్న భారత ఖైదీపై కూడా పాక్‌ డిఫెన్స్‌ ట్వీట్ చేసింది. పాక్‌ మావనతా ధృక్పథంతో జాదవ్‌ భార్యను కలిసేందుకు అంగీకరిస్తే.. భారత్‌ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసిందంటూ పోస్టు చేసింది. అయితే పాక్‌ ఫారిన్‌ అధికారి డాక్టర్‌ మహ్మద్‌ ఫైజల్‌ మాత్రం ఇండియా ఆ ప్రతిపాదనకు అంగీకరించిందంటూ ఓ ట్వీట్‌ చేయటంతో ఇది కూడా అబద్ధపు పోస్టు అని తేలిపోయింది. ఇక ఆ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ పేజీలతో ఎలాంటి సంబంధం లేదని పాక్‌ రక్షణ అధికారులు బుకాయిస్తున్నప్పటికీ... బ్లూ టిక్‌ మార్క్‌ ఉండటం.. పైగా పాక్‌ సైనిక అధికారులు అందులో సభ్యులుగా ఉండటం ద్వారా పాక్‌ నీచపు బుద్ధి బయటపడింది.

మరిన్ని వార్తలు