నక్సల్స్‌పై పోరుకు 100 ‘కమాండాగ్స్’

22 Sep, 2014 01:54 IST|Sakshi
నక్సల్స్‌పై పోరుకు 100 ‘కమాండాగ్స్’

న్యూఢిల్లీ: మందుపాతర్ల నుంచి బలగాలను కాపాడేందుకు, నక్సల్స్ మెరుపుదాడులను ముందే పసిగట్టి హెచ్చరించేందుకు ప్రభుత్వం 100కుపైగా ప్రత్యేక జాగిలాలకు శిక్షణ ఇస్తోంది. ‘కమాండాగ్స్’గా పిలిచే వీటిని నక్సల్స్ గాలింపు చర్యలకు వెళ్లే సీఆర్పీఎఫ్ వంటి పారామిలిటరీ బలగాల వెంట మోహరించనుంది. మందుపాతరల తాకిడి నుంచి యాంటీమైన్‌ప్రూఫ్ వాహనాలు రక్షణ కల్పించలేక పోతుండటంతో ఇకపై పదాతి దళాలు ఈ జాగిలాలే ముందుండి నడిపించనున్నాయి. బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందిన ‘మాలినోయిస్’ రకం శునకాలను దేశంలో తొలిసారిగా 2011లో ఐటీబీపీలో ప్రవేశపెట్టారు. దీంతో వీటికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కేంద్రం ఐటీబీపీకి అప్పగించింది.
 
శుత్రువుల జాడను పసిగట్టి దాడులు చేసేందుకు చాలా దేశాల సైన్యాలు ఈ శునకాలనే వాడుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న అల్‌కాయిదా చీఫ్ లాడెన్ జాడను పసిగట్టి అమెరికా నేవీ సీల్స్ దళాలు మట్టుబెట్టేలా సాయం చేయడం ద్వారా ‘మాలినోయిస్’లు ప్రపంచ ఖ్యాతి ఆర్జించాయి. వీటికి శిక్షణ అనంతరం నక్సల్స్ ఏరివేత చర్యల్లో పాల్గొనే ఒక్కో బెటాలియన్ వెంట కనీసం ఒక్కో ‘కమాండాగ్’ను మోహరించాలని యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. నక్సల్స్ ప్రాంతాల్లోని బెటాలియన్ క్యాంపుల్లో ఉండేందుకు వీలుగా ఈ కుక్కలకు, వాటి శిక్షకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు కమాండోలకు సరిసమానంగా పనిచేసే సామర్థ్యమున్నందుకే వీటికి ‘కమాండాగ్స్’ అని పేరుపెట్టారు.

మరిన్ని వార్తలు