పౌరులపై ఉక్కుపాదం

30 Dec, 2019 10:42 IST|Sakshi

నిరసనకారులపై కేసుల మోత 

రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కేసుల నమోదు 

చెన్నైలో ఒకేరోజు  పది వేల మందిపై నమోదు 

రంగోలితో యువతుల నిరసన 

అరెస్టు చేసిన చెన్నై పోలీసులు  

కేసుల ఎత్తివేతకు ప్రతిపక్షాల పట్టు 

సాక్షి, చెన్నై: కేంద్రం తీసుకొచ్చిన పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇళ్ల ముందు ‘రంగోలి’ తో నిరసన తెలిపిన యువతులను పోలీసులు అరెస్ట్‌ చేసి, కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే అధినేత స్టాలిన్, తుత్తుకుడి ఎంపీ కనిమొళి ఇళ్ల ముందు కూడా ‘వేండం (వుయ్‌ డోంట్‌ వాంట్‌) సీఏఏ-ఎన్‌ఆర్సీ’  అంటూ ముగ్గులు వేశారు. పౌర సవరణ చట్టానికి తాము వ్యతిరేకం అంటూ రంగోలి ద్వారా తమ నిరసన తెలిపారు. కాగా ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు సోమవారం కూడా అయిదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ముగ్గులతో నిరసన.. 
కాగా ఆదివారం చెన్నై బీసెంట్‌ నగర్‌లో ఉదయం ఎనిమిది మంది యువతులు వినూత్న నిరసన చేపట్టారు. అక్కడి కొన్ని ఇళ్ల ముందు రంగోలి వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ తమకు వద్దని, వాటిని వెనక్కు తీసుకోవాలన్న నినాదాలతో ఆ రంగోలి వేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. వీరి అరెస్టు సమాచారంతో డీఎంకే నేత స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో పాటు ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. వారిని విడిచి పెట్టాలని, నిరసనల్ని అణచి వేసే విధంగా కేసుల నమోదును ఆపకుంటే, ఉద్యమం ఎగసి పడుతుందని హెచ్చరించారు. దీంతో ఆ యువతుల్ని కాసేపటి తర్వాత విడుదల చేసినా, కేసుల్ని మాత్రం పోలీసులు ఎత్తి వేయలేదు. నిరసనలు కొనసాగిన పక్షంలో కేసుల మోత మోగుద్దంటూ పోలీసులు హెచ్చరించారు. ఇక, చెన్నైలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సాగిన ర్యాలీని సైతం పరిగణించి ఐదు వందల మందిపై కేసులు నమోదు చేయడం గమనార్హం.
 
రాష్ట్రంలో పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్న విషయం తెలిసిందే. తొలుత విద్యార్థులు పోరుబాట పట్టగా, ఆ తదుపరి ప్రజా సంఘాలు, ›ప్రతి పక్షాలు ఆందోళనలు ఉధృతం చేసే పనిలో పడ్డాయి. తాజాగా, ఈ నిరసనలు మైనారిటీల చేతుల్లోకి వెళ్లి ఉన్నాయి. మైనారిటీ సంఘాలు, సంస్థలు, పార్టీలు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ పౌర ఆగ్రహం రాజుకోవడంతో అధికార పక్షం ఇరకాటంలో పడింది. అదే సమయంలో ఈ పౌర చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం పళనిస్వామి ప్రకటన చేయాలని లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, మరో స్వాతంత్య్ర పోరాటం అన్నది తమిళనాడు నుంచే బయలుదేరుతుందన్న హెచ్చరికల్ని మైనారిటీ నేతలు చేయడంతో  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిరసనలు మరింతగా రాజుకునేలోపు ఉక్కుపాదంతో అణచి వేయడానికి సిద్ధం అయింది. 

చదవండిముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు

దీంతో పౌర చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిరసనకారులపై కేసుల మోత మోగించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శనివారం చెన్నైలో జరిగిన నిరసనలో పాల్గొన్న పిల్లలు, మహిళలు, యువతుల్ని సైతం వదలిపెట్టకుండా పది వేల మందిపై కేసులు పెట్టారు. ఇక, ఆదివారం చెన్నైలో రంగోళితో నిరసన వ్యక్తం చేసిన యువతుల్ని సైతం పోలీసులు వదలి పెట్ట లేదు. వారిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై సర్వత్రా ఆగ్రహం బయలు దేరడంతో వారిని షరతులతో విడిచి పెట్టారు. కాగా, కేసు మోతపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాటికి 50 వేల మందిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. ఇక, చెన్నైలో శనివారం తౌహిద్‌ జమాత్‌ నేతృత్వంలో ఆలందూరులో జరిగిన నిరసనలో అధిక శాతం మైనారిటీ మహిళలు, యువతులు, పిల్లలు తరలి వచ్చారు.  ఈ నిరసనకు నేతృత్వం వహించిన నేతలతో పాటుగా తరలి వచ్చిన పది వేల మందిపై కేసుల్ని పల్లావరం పోలీసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడం, చట్ట విరుద్ధంగా వ్యవహరించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించి, వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కల్గించడం వంటి సెక్షన్లతో ఈ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు