యాంటీ రోమియో స్క్వాడ్స్‌ ఓవర్‌ యాక్షన్‌

6 Apr, 2017 18:43 IST|Sakshi
యాంటీ రోమియో స్క్వాడ్స్‌ ఓవర్‌ యాక్షన్‌
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ ఏర్పాటు చేసిన ‘యాంటీ రోమియో స్క్వాడ్‌’లు  ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాయి. పార్కుల్లో, కళాశాలల వద్ద, బస్టాప్‌ల వద్ద యువతీ యువకులు జంటగాను, గుంపులుగాను కనిపిస్తే చాలు పట్టుకుంటున్నారు. తమది ఒకే కాలేజీ అని, క్లాస్‌మేట్స్‌ అని, స్నేహితులమని ఎంత చెప్పిన వినకుండా గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తున్నారు. తల్లిదండ్రుల వివరాలు తీసుకొని ‘మీ పిల్లలు ఒకే బైకు మీద తిరుగుతున్నారు. క్లాస్‌ ఎగ్గొట్టి పార్క్‌ల వెంట షికార్లు చేస్తున్నారు’ అంటూ ఫిర్యాదులు చేయడమే కాకుండా అమ్మాయిలతోని ఇక రోడ్ల మీద, పార్కుల్లో తిరగమని గుంజీలు తీయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చితకబాదుతున్నారు. కొందరికి గుండ్లు కొట్టిస్తున్నారు. ఇటీవల పోలీసుల సమక్షంలో యాంటీ రోమీయో స్క్వాడ్‌ యువకులకు గుండ్లు కొట్టించినందుకు ఆ పోలీసులపై చర్య తీసుకోవాల్సిందిగా స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. 
 
ఆకతాయి యువకుల నుంచి కాకుండా యాంటీ రోమియో స్క్వాడ్ల నుంచి తమకు వేధింపులు ఎక్కువయ్యాయని, ముందుగా వీరి నుంచి రక్షించాల్సిందిగా యువతులు, యువకులు పోలీసు ఉన్నతాధికారులతో మొరపెట్టుకుంటున్నారు. దాదాపు 20 మంది మహిళా హక్కుల కార్యకర్తలు ముఖ్యమంత్రి యోగిని కలసుకొని అర్జెంట్‌గా ఈ స్క్వాడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, పౌరులతో ఏర్పాటు చేసిన ఈ స్క్వాడ్లు మోరల్‌ పోలీసులుగా వ్యవహరిస్తున్నారని మహిళా హక్కుల న్యాయవాదులు ఇందిరా జైసింగ్, బందా గోవర్, మహిళా హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, కవితా కష్ణన్, కమలా బాసిన్‌ తదితరులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ స్క్వాడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
2015 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 91వేల లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. వాటిలో 9 శాతం కేసులు 20 కోట్లకుపైగా జనాభా ఉన్న యూపీలో చోటుచేసుకున్నాయి. 2010 నాటితో పోలిస్తే దేశంలో నానాటికి మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతూ వస్తున్నాయి.

 

మరిన్ని వార్తలు