టార్గెట్‌ ముంబై!

15 Jan, 2018 01:46 IST|Sakshi

మావోయిస్టు పార్టీ విస్తరణ వ్యూహం

గుజరాత్, మహారాష్ట్రలలో పూర్వవైభవానికి ఎత్తుగడ

ముంబై కార్మిక ప్రాంతంలో విస్తరణకు చర్యలు

స్థానిక పోలీసులకు మావోలు చిక్కడంతో గుట్టురట్టు

రంగంలోకి దిగిన రాష్ట్ర ఎస్‌ఐబీ

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోందా? ముంబైలో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ బృందం చేపట్టిన తనిఖీల్లో ఏడుగురు మావోయిస్టులు పట్టుబడటం ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. మహారాష్ట్రలో మావోల పునర్నిర్మాణం చర్యలు నిజమేనని నిఘా వర్గాలు కూడా స్పష్టం చేశాయి. గుజరాత్, మహారాష్ట్ర కేంద్ర కమిటీలో ఉన్న 21 మంది నేతల్లో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారే ఉండటం దేశవ్యాప్తంగా పార్టీ పటిష్టతకు మావోలు సాగిస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడగానే గుర్తించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు ముంబైలో కార్యకలాపాలు సాగిస్తుండటం వెనకున్న కారణాలపై ఆరా తీసేందుకు రాష్ట్ర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐబీ) ఒకటి ముంబై వెళ్లింది. 

కార్మిక ప్రాంతంలో షెల్టర్‌... 
తెలంగాణ, ఆంధప్రదేశ్, గుజరాత్, పుణే, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతాలైన విక్రోలీ, రాంబాయ్, అంబేడ్కర్‌నగర్, కామ్‌రాజ్‌ నగర్‌లలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని కార్మికులను తమ కోసం పనిచేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర కమిటీ ఆదేశాలతో కొందరు మావోయిస్టులు రహస్యంగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం అరెస్టయిన ఏడుగురు కూడా ఇదే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. 

నేతలందరి ఆవాసం అక్కడే... 
మావోయిస్టు నేత గణపతి గతంలో తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కున్నాడని, ఆ సమయంలో ముంబై వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు ఎస్‌ఐబీ గుర్తించింది. ఇప్పుడు అరెస్టయిన వారిని విచారిస్తే గణపతి ట్రీట్‌మెంట్‌ వ్యవహారంతోపాటు ఇతర కీలక నేతలంతా వారి నివాసాలనే షెల్టర్‌గా మార్చుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. 2015 మే 10న సీపీఐఎంల్‌–నక్సల్బరీ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.మురళీధరణ్‌ అలియాస్‌ అజిత్‌ కూడా ఇక్కడే పట్టుబడ్డట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 

ఆ 135 మందిలో ఉన్నారా? 
ముంబైలో ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసిన ఏడుగురు మావోయిస్టు నేతలు అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ వ్యక్తుల జాబితాలో ఉన్నారా లేరా అనే విషయమై ఎస్‌ఐబీ అధికారులు ఆరా తీయనున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ముంబైలోనే నివసిస్తున్న వీళ్లు మావోయిస్టు పార్టీలో ఏ క్యాడర్‌లో పనిచేస్తున్నారు... వారి పేర్లు ఏమిటి తదితర వివరాలన్నింటిపై వివరాలు సేకరించనున్నారు. అజ్ఞాతంలో ఉన్న 135 మందిలో ఈ ఏడుగురు ఉన్నారా లేక ఇలాంటి వారు ఇంకెంత మంది స్లీపర్‌ సెల్స్‌గా ఉంటున్నారనే దానిపై విచారిస్తున్నామని ఎస్‌ఐబీ ఉన్నతాధికారులు తెలిపారు. 

గోల్డెన్‌ కమిటీలో ఆ ప్రాంతాలే... 
వ్యాపార కేంద్రాలకు చిరునామా అయిన గుజరాత్‌తోపాటు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహారాష్ట్రలో పార్టీ పునర్మిణానికి గోల్డెన్‌ కారిడార్‌ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగిస్తోంది. 2008లోనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అప్పటి సెంట్రల్‌ కమిటీ సభ్యుడు తుషార్‌ భట్టాచార్య అరెస్టుతో కాస్త డీలాపడినా ఆ తర్వాత మావోయిస్టు కీలక నేత కోబడ్‌ గాంధీ చర్యలతో పార్టీ పటిష్టమైంది. ఆ తర్వాత ఈ కమిటీ ప్రభావం గుజరాత్‌లోని అహ్మదాబాద్, వల్సాడ్, కచ్, బనస్కాంత, వడోదరా, సూరత్, డాంగ్‌ ప్రాంతాల్లో ఉండేది. పట్టణ ప్రాంతాల్లో పార్టీ విస్తృతే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశమని కోబడ్‌ గాంధీ 53 పేజీలతో ప్లీనరీ నిర్ణయాలను రూపొందించారు. అలాగే మహారాష్ట్రలోని ముంబై, పుణే, ఔరంగాబాద్‌ ప్రాంతాలను సైతం ఈ కమిటీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిసింది. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లతోపాటు మహారాష్ట్ర మొత్తం కూడా గతంలో రెడ్‌ కారిడార్‌ కమిటీలో భాగంగా ఉండేది. అయితే పట్టణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణం కోసం సానుభూతిపరులను, పార్టీ క్యాడర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం గోల్డెన్‌ కారిడార్‌లోకి మహారాష్ట్రలోని ముంబై, పుణేలను తెచ్చినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.  
 

మరిన్ని వార్తలు