జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన

1 Oct, 2016 12:21 IST|Sakshi
జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పది రోజుల క్రితం జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె గురించి గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్ బులెటిన్‌లు కూడా ఏమీ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లండన్ నుంచి వచ్చిన వైద్యుడు రిచర్డ్ జాన్ ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్ అంటూ ఆస్పత్రిలో చేరినా.. ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని, అదుకే ఆమె చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నాడీఎంకే వర్గాలు గానీ, రాష్ట్ర మంత్రులు గానీ, చివరకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గానీ దీనిపై స్పందించకపోవడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్పత్రి ఆవరణ మొత్తం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

జయలలిత ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని రెండు రోజుల క్రితం ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాతి నుంచి బులెటిన్లు ఇవ్వడం కూడా మానేశారు. జయలలితతోపాటే ఐసీయూలో ఆమెకు తోడుగా ఉంటున్న నెచ్చెలి శశికళ అసలు బయటకే రావడం లేదు. ఆమె ఇంటికి కూడా వెళ్లడంలేదు. దాంతో ఇది రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం రెండురోజులకు ఒకసారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు గానీ, మీడియాకు చెప్పేందుకు మాత్రం వెనకంజ వేస్తున్నారు. ఏ విషయం బయటకు చెప్పొద్దని ఆమె ఆస్పత్రిలో చేరకముందే వాళ్లకు ఆదేశాలు వచ్చినట్లు అన్నాడీఎంకే కార్యకర్తలు చెబుతున్నారు. రెండు రోజల క్రితం పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి మాత్రం.. జయలలిత కోలుకుంటున్నారని చెప్పారు.

రాష్ట్రపతికి సుప్రీం న్యాయవాది లేఖ
జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. సీఎం ఆరోగ్యం గురించి ఎవరూ బయటకు ఏమీ చెప్పడం లేదని రీగన్ ఎస్. బెల్ అనే న్యాయవాది ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ఆగిపోయిందని, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ఆమె ఆరోగ్యం గురించి ఏమీ తెలియదని చెప్పారు.

ఆస్పత్రి ప్రాంగణంలో వేలాదిమంది పోలీసులను మోహరించారని, చివరకు సీఎంను చూసేందుకు గవర్నర్‌ను కూడా అనుమతించడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, సీఎం ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించే పరిస్థితిలో జయలలిత ఉన్నారో లేదో చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు