భయాందోళనల్లో భారతీయ అమెరికన్లు

14 Aug, 2017 17:44 IST|Sakshi
భయాందోళనల్లో భారతీయ అమెరికన్లు

చార్లట్స్‌విల్‌: నగరంలో జరిగిన శ్వేత జాతీయుల ర్యాలీ హింసాత్మకంగా మారడం అక్కడ నివసించే భారతీయ అమెరికన్లపై ప్రభావం చూపుతోంది. ఆదివారం మధ్యాహ్నానికి ర్యాలీ ఘటనలో జరిగిన హింస తాలూకు వివాదం సద్దుమణిగినా, దాన్ని కళ్లారా చూసిన సగటు ఇండో-అమెరికన్‌ మనసులో సందేహాలు మొదలయ్యాయి.

వర్జీనియా రాష్ట్రంలో ఉన్న చార్లట్స్‌విల్‌ నగర జనాభా 50 వేలు. వర్జినియా రాష్ట్రంలో స్థిరపడిన భారతీయులు సంఖ్య పెద్దగానే ఉంది. శనివారం జరిగిన ర్యాలీలో భారతీయులు ఎవరూ గాయపడలేదు. అయితే, ఇది భారతీయ అమెరికన్లకు ఓదార్పు కావడం లేదు. వారిలో ఏదో తెలియని భయం, ఏదైనా అయిపోతుందనే ఆందోళన నెలకొందని యూనివర్సిటీ ఆఫ్‌ వర్జినియాలో సీనియర్‌ అసోసియేట్‌గా పని చేస్తున్న శంకరన్‌ వెంకటరామన్‌ పేర్కొన్నారు.

చార్లట్స్‌విల్‌లో తాను గత ఇరవై ఏళ్లుగా నివసిస్తున్నట్లు చెప్పారు. తన కూతురి స్నేహితురాలు శ్వేత జాతీయులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొనగా హింసలో ఆమె కాలు విరిగినట్లు వెల్లడించారు. హింస చార్లట్‌విల్‌ ప్రజల వ్యక్తిత్వం కాదని అన్నారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరుగుతుందని నగరవాసులు కలలో కూడా ఊహించి ఉండరని చెప్పారు.

ప్రస్తుతం యూనివర్సిటీకి సెలవులు ఇచ్చారని, మరో రెండు వారాల్లో మళ్లీ తెరుస్తారని తెలిపారు. యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చే యువతలో ఈ ఘటనపై భయాందోళనలు కచ్చితంగా ఉంటాయని అన్నారు.

మరిన్ని వార్తలు