ఎవరైనా నామినేట్‌ చేయవచ్చు

19 Aug, 2017 01:21 IST|Sakshi
ఎవరైనా నామినేట్‌ చేయవచ్చు

పద్మ అవార్డు ప్రతిపాదనల్లో కేంద్రం మార్పులు
న్యూఢిల్లీ:
వివిధ రంగాల్లో విశిష్ట  సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పద్మ అవార్డులను ఎవరికివ్వాలో ప్రజలెవరైనా ప్రతిపాదించవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు 2018 ఏడాదికి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. ‘పద్మ అవార్డుల నామినేషన్లు స్వీకరించడానికి చివరితేదీని సెప్టెంబర్‌ 15గా నిర్ణయించాం. ప్రజల్లో ఎవరైనా పద్మ అవార్డుల కోసం ఎవరి పేర్లయినా ప్రతిపాదించవచ్చు.

దీనివల్ల వెలుగులోకి రాని చాలామంది అర్హులైన వ్యక్తులకు సరైన గుర్తింపు లభిస్తుంది’అని హోంశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రజలందరూ తమ ప్రతిపాదనలను అధికారిక వెబ్‌సైబ్‌  ఠీఠీఠీ.p్చఛీఝ్చ్చఠ్చీటఛీట. జౌఠి.జీn కు పంపాలని కోరింది. కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సామాన్యులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎంలు, గవర్నర్లు, మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారత రత్న, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీతలు కూడా పద్మ అవార్డు కోసం వ్యక్తుల పేర్లను ప్రతిపాదించవచ్చని హోంశాఖ వెల్లడించింది. ప్రధాని మోదీ నియమించిన పద్మ అవార్డుల కమిటీ అవార్డుల ప్రదానంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. గతంలో రాజకీయ నేతలు, మంత్రులు సిఫార్సు చేసినవారికే పద్మ అవార్డులు అందేవి. 

మరిన్ని వార్తలు