ఆర్టికల్‌ 35ఏ కూడా రద్దైందా?

5 Aug, 2019 15:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్‌ చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. లఢక్‌ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ మోదీ సర్కారు సోమవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్‌ 370ను రద్దు చేయడంతో ఇందులో కీలకాంశంగా ఉన్న ఆర్టికల్‌ 35ఏ కూడా రద్దైంది. జమ్మూకశ్మీర్‌లో ఎవరికి శాశ్వత నివాసం కల్పించాలి, కల్పించకూడదు అనే నిర్ణయాధికారాన్ని రాష్ట్ర చట్టసభకు ఇప్పటివరకు ఆర్టికల్‌ 35ఏ కల్పించేది. దీని ప్రకారం జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసం లేని వ్యక్తులు రాష్ట్రంలో స్థిరాస్తులు కొనడానికి వీల్లేదు.

ఆర్టికల్‌ 35ఏ రద్దైయిన నేపథ్యంలో బయటి వ్యక్తులు కేంద్రపాలిత కశ్మీర్‌లో ఆస్తులు సమకూర్చుకుని శాశ్వత నివాసం ఏర్పచుకోవచ్చా అనే ప్రశ్న ఎక్కువగా వినబడుతోంది. కల్లోల కశ్మీర్‌లో ఉండలేక 1989 నుంచి ఎంతో మంది కశ్మీర్‌ పండిట్లు ఆస్తులు అమ్ముకుని సొంతగడ్డను వదిలి వలసపోయారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో మాతృభూమికి తిరిగి వచ్చేందుకు కశ్మీర్‌ పండిట్లు సమాత్తమవుతున్నారు. ఆర్టికల్‌ 35ఏ రద్దుపై ముఖ్యంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కశ్మీర్‌ మహిళలు బయటి వ్యక్తులకు వివాహం చేసుకుంటే వారికి ఆస్తి హక్కు ఉండదు. ఇలాంటి వారి పిల్లలు కూడా కశ్మీర్‌లో సొంత ఇల్లు లేదా దుకాణాలు కలిగివుండడానికి కూడా ఆర్టికల్‌ 35ఏ అనుమతించదు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ మహిళలు నాన్‌-కశ్మీరీలను వివాహం చేసుకున్నా వారి ఆస్తి హక్కుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కశ్మీరేతరులు కూడా జమ్మూ కశ్మీర్‌లో నిశ్చింతగా స్థలాలు, ఆస్తులు కొనుక్కోవచ్చు.

ఆర్టికల్‌ 35ఏ రద్దు కావడంతో కశ్మీర్‌ ఆర్థికంగా వృద్ధి సాధించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు బయటి వ్యక్తులు కశ్మీర్‌లో స్థలాలు కొనేందుకు వీలులేకపోవడంతో మౌలిక సదుపాయాల సంస్థలు, బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టలేకపోయాయి. దీంతో కశ్మీరీల ఉపాధికి భారీగా గండి పడింది. ఆర్టికల్‌ 35ఏ రద్దుతో అడ్డంకులు తొలగిపోవడంతో పెట్టుబడులు పెరిగి కశ్మీర్‌ ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్టికల్‌ 35ఏ రద్దు కచ్చితంగా కశ్మీర్‌ ఆర్థికాభివృద్ధికి మేలు చేస్తుందని గట్టిగా చెబుతున్నారు. (చదవండి: సంచలన నిర్ణయం ఆర్టికల్‌ 370 రద్దు)

>
మరిన్ని వార్తలు