ఆ సమయంలో ఆర్కే అక్కడ లేరు...

26 Oct, 2016 12:09 IST|Sakshi
ఆ సమయంలో ఆర్కే అక్కడ లేరు...

మల్కన్‌గిరి : ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కానీ, అరుణ కానీ లేరని, ఆర్కే కుమారుడు మున్నా మాత్రం ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు  బలగాలకు తారసపడిన మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పారు.

మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎన్‌కౌంటర్‌లో కొందరు తీవ్రంగా గాయపడి తప్పించుకు పారిపోయారన్నారు. ఒక్కరు కూడా తమకు లొంగిపోలేదని పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ ఎంతమాత్రం కాదన్నారు. చట్టప్రకారం, ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలను 72 గంటల పాటు భద్రపరుస్తామని, మృతుల సంబంధీకులు వస్తే అప్పగిస్తామని చెప్పారు. విజయనగరంలో ఉంటున్న మురళి కుటుంబసభ్యులు మాత్రమే ఇప్పటికవరకు తమను ఫోన్‌లో సంప్రదించారని, మృతదేహాన్ని తీసుకువెళతామని చెప్పారని తెలిపారు. కాగా ఏవోబీ ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 28మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు