చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : బీజేపీ

14 Dec, 2018 13:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రత విషయంలో బీజేపీపై బురద జల్లిన ప్రతిపక్షాలకు రాఫెల్‌ డీల్‌పై సుప్రీం కోర్టు తీర్పు చెంపదెబ్బ వంటిదని బీజేపీ వ్యాఖ్యానించింది. తనపై కేసుల విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీపై బురద జల్లినందుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి గాయత్రి డిమాండ్‌ చేశారు.

బీజేపీకి అభివృద్ధి అంత్యోదయ మాత్రమే తెలుసని, పచ్చ కాంగ్రెస్ నాయకుడు మాత్రం అంతర్జాతీయ కుట్రలు చేయడంలో ఆరితేరారని అన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ డీల్ విషయంలో ఎలాంటి కుంభకోణం జరగలేదని తీర్పునిస్తూ అన్ని పిటిషన్లను కొట్టివేసి దేశ భద్రత విషయంలో సన్నద్ధంగా ఉండవలసిందే అని సూచించిందని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు
నరేంద్ర మోదీ నిజాయితీపరుడు ఈ దేశానికి కాపలాదారుడు అని మరోసారి నిరూపించుకున్నారని సుప్రీం తీర్పుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం అన్నారు.రాఫెల్ ఒప్పందంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేయడం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు .


స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ రాఫెల్ విమానాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను  రాజకీయాలకోసం పణంగా పెడితే నరేంద్ర మోదీ నిజాయితీపరుడిగా దేశ కాపలాదారుగా మరోసారి నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు.

మరిన్ని వార్తలు