ఆస్తులపై ఆదేశాలను ఉపసంహరించుకోండి

15 May, 2017 01:31 IST|Sakshi

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్‌ ఘాటైన లేఖ
సాక్షి, న్యూఢిల్లీ:
రాష్ట్ర పునిర్వభజన చట్టం షెడ్యూల్‌ పదిలోని సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీపై ఇటీవల కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు వీలుగా ఆదేశాల జారీ చేయాలని కేంద్ర హోంశాఖను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మహర్షికి ఘాటైన లేఖ రాశారు. ఉన్నత విద్యా మండలి ఆస్తుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్లకు అనుగుణంగా ఉందని, చట్టంలోనే ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తిలో పంపిణీ చేసుకోవాలని ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో దినేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అయితే సుప్రీం తీర్పును అమలు చేయకుండా కేంద్ర హోంశాఖ ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ ఆదేశాలు ఇవ్వడం సుప్రీం తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవడంతో పాటు సుప్రీం తీర్పునకు అనుగుణంగా పదవ షెడ్యూల్‌ సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 48తో పాటు 47 కూడా చూడాలని, ఇందుకు అనుగుణంగానే స్థిర, చరాస్తులతో పాటు భూమి, స్టోర్స్, ఆర్టికల్స్‌ ఇతర వస్తువులను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్‌ రాజధానిగా ఉన్నందున అన్ని ఆస్తులు తెలంగాణలోనే ఉంటాయని, రాష్ట్రం విడిపోయినందున ఏపీకి ఏమీ రావని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తీర్పులో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 48, 47 సెక్షన్ల మేరకు ఆస్తులతో పాటు అప్పులు, ఆర్థికపరమైన సర్దుబాటు ఉన్నట్లు పేర్కొన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.

>
మరిన్ని వార్తలు