ల్యాండ్ పూలింగ్‌తో జీవితాలు తాకట్టు

20 Jan, 2015 01:30 IST|Sakshi
ల్యాండ్ పూలింగ్‌తో జీవితాలు తాకట్టు

* ప్రజా ఉద్యమ జాతీయ కూటమి ఆందోళన
* ఆంధ్రప్రదేశ్ విధానంతో ఆహార భద్రతకూ ముప్పే
* గాంధీ స్ఫూర్తితో పోరాటాలు చేయాలన్న శరద్‌యాదవ్
* చంద్రబాబు.. తాకట్టు విధానాలు వీడాలన్న స్వామి అగ్నివేశ్

 
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్ కేవలం ప్రజల జీవితాలను తాకట్టు పెట్టేలా ఉందని ప్రజా ఉద్యమాల జాతీయ కూటమి(ఎన్‌ఏపీఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల అనుమతి, సంప్రదింపులు లేకుండా, పర్యావరణ అనుకూలతలు పట్టించుకోకుండా, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపైనా కనీసం చర్చించకుండా టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగుతోందని కూటమి దుయ్యబట్టింది. సింగపూర్ తరహా రాజధాని అంటూ ఆకాశంలో చందమామను చూపి భూములను మింగేస్తున్నారని విమర్శించింది.
 
 రాజధాని నిర్మాణంపై ఏపీ అవలంబిస్తున్న వైఖరిని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కూటమి తీర్మానించింది. ఈ మేరకు ఎన్‌ఏపీఎం జాతీయ కన్వీనర్ రామకృష్ణరాజు, మాజీ ఐఏఎస్ అధికారి దేవసహాయం అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో ‘ఏపీ గ్రీన్ ఫీల్డ్ రాజధాని, భూసేకరణ చట్టం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జేడీయూ అధినేత శరద్‌యాదవ్, సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు డి.రాజా, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌తో పాటు వివిధ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ‘చట్ట ప్రకారం ఎలాంటి భూమినైనా ఎంతటి అవసరాల కోసమైనా ప్రజలతో సంప్రదింపులు జరపకుండా సేకరించరాదు.
 
ఆహార భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా వ్యవసాయ భూముల సేకరణ జరగాలి. కానీ ‘ఫుడ్ బౌల్ ఆఫ్ ఏపీ’గా ఉన్న వీజీటీఎం(విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) ప్రాంతాన్ని రాజధాని పేరిట నాశనం చేస్తున్నారు. గ్రామీణ నిర్మాణ వికాసాన్ని చెదరగొట్టి.. ప్రభుత్వం చెబుతున్న ‘మేకిన్ ఇండియా’ ఎలా సాధిస్తారు?’ అని వక్తలు ప్రశ్నించారు. ఆహార భద్రతకు భరోసా లేనప్పుడు జాతీయ భద్రత ఎక్కడుందన్నారు. ఈ సందర్భంగా దేవసహాయం పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పేరిట ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నది, వారిని దెబ్బతీసే యత్నాలు ఎలా జరుగుతున్నాయి వంటి అంశాలను వివరించారు. ‘120 రకాల పంటలు, ఏడాదికి రూ.1000 కోట్ల వ్యవసాయోత్పత్తి ఉన్న భూములను పూలింగ్ పేరిట లాక్కొంటూ ప్రజలను ఫూల్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
 
బాధిత ప్రజలకు అండగా ఉంటాం: శరద్‌యాదవ్, జేడీయూ అధినేత
కేంద్రం తెచ్చిన భూసేకరణ బిల్లు దేశం మొత్తాన్నీ లూఠీ చేసేలా ఉందని జేడీయూ అధినేత శరద్‌యాదవ్ విమర్శించారు. ఆవో.. లూటో.. కమావో (రండి..దోచుకోండి..సంపాదించండి) అన్న తరహాలో వ్యవహరిస్తూ కార్పోరేట్ కంపెనీలకు దాసోహం పలుకుతోందని నిప్పులు చెరిగారు. ఒక్క ఏపీలోనే కాకుండా దేశమంతటా ఇలాంటి కొల్లగొట్టే చర్యలే జరుగుతున్నాయన్నారు. రైతులకు నష్టం కలగనీయకుండా మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఉద్యమించాల్సి ఉందన్నారు. ఏపీ రాజధాని బాధిత రైతులకు అండగా ఉంటామన్నారు. వారి కోసం పార్లమెంటు లోపలా, బయటా కూడా పోరాడతామని నొక్కి చెప్పారు.
 
బాబువి తాకట్టు విధానాలు: అగ్నివేశ్
ఏపీ సీఎం చంద్రబాబు.. తన తాకట్టు విధానాలను కొనసాగిస్తున్నారని సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ‘ప్రజాభిప్రాయానికి తిలోదకాలిస్తూ భూసేకరణ చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో సింగపూర్ ప్రతినిధులకు తెలియదు. వారి చేతిలో రాజధాని నిర్మాణం పెట్టి అభివృద్ధి అంటే అది గ్రామీణ వ్యవస్థను వినాశనం చేయడమే. శివరామకృష్ణన్ కమిటీ సైతం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించింది. వాటిని ఉల్లంఘించి ముందుకెళితే ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.
 
గొంతు నొక్కారు: రామచంద్రయ్య
 రాజధాని నిర్మాణం విషయంపై శాసనసభ, మండలిలో సీఎం చంద్రబాబు.. విపక్షం గొంతు నొక్కి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య తెలిపారు. విజయవాడ చుట్టూ 180 కిలోమీటర్ల పరిధి అంత సురక్షిత ప్రాంతం కాదని జియోలాజికల్ శాఖ తేల్చిచెప్పినా సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. సింగపూర్ తరహా రాజధానిపై కేబినెట్‌లోని మంత్రులకే తెలియదని, ఎమ్మెల్యేలకు ల్యాండ్ పూలింగ్‌పై కనీస అవగాహనా లేదని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసులతో కవాతులు చేయిస్తున్నారన్నారు. ‘అక్కడేమైనా జిహాదీలు తిరుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. ఇలాంటి రాక్షస నిర్ణయాలు దేశానికి ముప్పని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు