హోదా ఇవ్వకుండా విశ్వాస ఘాతుకం

8 Dec, 2015 03:14 IST|Sakshi
హోదా ఇవ్వకుండా విశ్వాస ఘాతుకం

♦ మోదీ, వెంకయ్య, చంద్రబాబు మోసం చేస్తున్నారు
♦ నిధులివ్వకుండా మట్టి, నీళ్లు తెచ్చి ప్రధాని అవమానపర్చారు
♦ జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో అఖిలపక్ష నేతల ధ్వజం
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ప్రకటించే వరకూ పార్లమెంటు లోపల, వెలుపల ఉద్యమించాలని నిర్ణయించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ.. నిధులివ్వకుండా నీళ్లు, మట్టి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను అవమానించారన్నారు. అదే మట్టి, నీళ్లతో ఢిల్లీలో నిరసన చేపడతామన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులతోపాటు విభజన హామీల  అమ లుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల ఫోరం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, కాంగ్రెస్, లోక్‌సత్తా, మాలమహానా డు, పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

 హోదాతోనే అభివృద్ధి..
 ప్రత్యేక హోదాతోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న వెంకయ్యకు అప్పుడు ఏకాభిప్రాయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.  విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ధర్నాలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీపీఐ నేతలు రాజా, సురవరం సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ, సీపీఎం నేతలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.
 
 హోదా కొత్త కోరికేమీ కాదు
 ప్రత్యేక హోదా కొత్త కోరికేమీ కాదు. విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హోదా హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. హోదా ఇవ్వాల్సిన బాధ్యత మోదీ, వెంకయ్య, చంద్రబాబుపై ఉంది. రాష్ట్రానికి హోదా జీవనాడి లాంటిది. మాపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రధాని, హోం, ఆర్థిక మంత్రులను పలుమార్లు కలిసి ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరాం. అఖిలపక్ష భేటీ, పార్లమెంటు.. ఎక్కడ, ఏ సందర్భం వచ్చినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. హోదా లభిస్తే పరిశ్రమలొచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.
         - మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ
 
 మోడ్రన్ క్యాటగిరీ అంటూ టీడీపీ మోసం
 ప్రత్యేక హోదా మాటమార్చి ఇప్పుడు మోడ్రన్ క్యాటగిరీ అంటూ టీడీపీ మోసం చేస్తోంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఇప్పించాలి. మంత్రి పదవులు కాపాడుకోటానికి, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ గుంటూరులో ఆమరణ దీక్ష చేసినా స్పందించలేదు. హోదా ఇవ్వాలని పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రం విడిపోయి 18 నెలలు దాటుతున్నా వెనుకబడిన 7 జిల్లాలకు నిధులు ఇవ్వలేదు.
     - వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ

మరిన్ని వార్తలు