15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి

11 Mar, 2017 03:34 IST|Sakshi
15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి

ఎఫ్‌ఆర్‌బీఎంను 5 శాతానికి నిర్ధారించాలి
ఐదేళ్లు దాటినా రెవెన్యూ లోటే ఉంటుంది
ప్రయివేటు బిల్లులో ప్రతిపాదించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ  


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 15 ఏళ్ల పాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని పదో భాగానికి అదనంగా పది–ఏ భాగంలో ఈ అంశాన్ని చేర్చాలని ఆయన ప్రతిపాదించారు. ఈ భాగం కింద సెక్షన్‌ 94ఏ, 94 బీ, 94 సీ సెక్షన్లను పొందుపర్చాలని కోరారు.

రెవెన్యూ లోటు తప్పదు..
‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు ఎలాంటి వ్యత్యాసం చూపకపోయినా విత్త సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాలకు అమలుచేస్తోంది. ఆ రాష్ట్రాలు కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే వచ్చే ఐదేళ్ల తరువాత కూడా రెవెన్యూ లోటును ఎదుర్కొంటుందని 14వ ఆర్థిక సంఘం తెలిపింది. అందువల్ల ఇతర రాష్ట్రాలతో సమాన బలం చేకూరా లంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయడం తప్పనిసరి..’ అని వైవీ సుబ్బారెడ్డి బిల్లులో పేర్కొన్నారు.

బడ్జెట్‌ సమావేశాల్లో చిక్కిన అవకాశం...
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గత ఏడాది జులై వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించిన ప్రయివేటు బిల్లును ఎట్టకేలకు బడ్జెట్‌ రెండో విడత సమావేశాల్లో ప్రవేశపెట్టగలిగారు. వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో ప్రయివేటు మెంబరు బిజినెస్‌ ఎజెండాలో పలు మార్లు చోటు దక్కినా ప్రయివేటు మెంబరు బిజినెస్‌ రాకముందే సభ వాయిదాపడడంతో ఈ బిల్లును ప్రవేశపెట్టలేకపోయారు. ఎట్టకేలకు శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు.