రామ మందిరం : ములాయం కోడలి సంచలన వ్యాఖ్యలు

1 Nov, 2018 18:07 IST|Sakshi

లక్నో : సమాజ్‌ వాదీ పార్టీలోని రాజకీయ విబేధాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. వారం రోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ కూడా ఇదే బాటలో నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రామ మందిరం నిర్మాణం గురించి అపర్ణ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం తప్పక జరగాల్సిందే. జనవరిలో జరగబోయే ​కోర్టు విచారణ కోసం మేము ఎదురు చూస్తున్నాం’ అంటూ అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక శివ్‌పాల్‌ యాదవ్‌ స్థాపించిన ప్రగతిశీల్‌ సమాజవ్‌ వాదీ పార్టీ 2019 ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అపర్ణ తెలిపారు. ‘2019 ఎన్నికల్లో పోటీ చేసే​ అవకాశం వస్తే ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగుతారు’ అని ప్రశ్నించగా.. ‘పెద్దలు ఎటువైపు ఉంటే నేను అటే. అయినా 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంద’న్నారు. దాంతో అపర్ణ కూడా శివ్‌పాల్‌, నేతాజీ(ములాయం సింగ్‌ యాదవ్‌)ల దారిలోనే నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కుమారుడు.. సోదరుని మధ్య విభేదాలతో సతమతమవుతోన్న నేతాజీకి చిన్న కోడలు అపర్ణ వ్యాఖ్యలు మరిన్ని కొత్త సమస్యలు తెచ్చి పెట్టేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని వార్తలు