ఆపిల్‌ ఉద్యోగి హత్యకు ఎవరు బాధ్యులు?

1 Oct, 2018 14:39 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో పోలీసు కాల్పుల్లో ఆపిల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగి వివేక్‌ తివారి మరణించిన సంఘటన సూచిస్తోంది. శనివారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ప్రస్తుతం రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా, తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, తాను సకాలంలో స్పందించి జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేశానని యోగి వాదిస్తున్నారు.

మరోపక్క తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న పోలీసులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వివేక్‌ తివారి భార్య కల్పనా తివారి ఆదివారం రెండో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఆత్మరక్షణ కోసమే తన భర్త కాల్పులు జరిపారని, ఆయన్ని అనవసరంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో కౌంటర్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడానికి తనకూ అవకాశం ఇవ్వాలని పోలీసు కానిస్టేబుల్‌ ప్రశాంత్‌ చౌధరి భార్య రాఖీ మాలిక్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె కూడా పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కారు మీదకు దూసుకరావడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని కానిస్టేబుల్‌ ప్రశాంత్‌ చౌధరి చెబుతున్నారు. కారు దూసుకొస్తే కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకొస్తుందన్న ప్రశ్నకు ఆయన నుంచి సరైన సమాధానం రావడం లేదు.

‘అనుమానంతోని ఎవరినైనా చంపేయడానికి ఇదేమన్న జమ్మూ కశ్మీరా?’ అని వివేక్‌ తివారి బావమరిది మీడియాతో వ్యాఖ్యానించారు. ‘ఎంతో విశ్వాసంతో బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం. ఆ తర్వాత యోగిని ముఖ్యమంత్రిని చేస్తున్నారంటే మరెంతో సంతోషించాం. అందుకు ప్రభుత్వం నా భర్తను పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదు’ అని కల్పనా తివేరి  మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె  మాటల్లో కచ్చితమైన అంతరార్థం ఉంది. ఆమె భర్త చావుకు యోగి ప్రభుత్వం ప్రత్యక్షంగా కారణం కాకపోయినా, పరోక్షంగా కారణమైంది. యోగి ప్రభుత్వం హయాంలో దాదాపు 1400 బూటకపు ఎన్‌కౌంటర్లు జరగ్గా, వాటిల్లో 60 మందికిపైగా మరణించారు.

తొలి 10 నెలల్లోనే 921 ఎన్‌కౌంటర్లు
యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి పది నెలల కాలంలోనే అంటే, 2017, ఏప్రిల్‌ నెల నుంచి 2018, ఫిబ్రవరిలోగా రాష్ట్రంలో 921 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిల్లో 33 మంది మరణించారు. వీటిపై సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ యోగి ప్రభుత్వానికి నోటీసు కూడా జారీ చేసింది. ఇదే కాలంలో 365 లాకప్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ అండదండలు, ఆశీర్వాదంతో రాష్ట్రంలో పోలీసులు తమ ఇష్టా రాజ్యంగా చెలరేగిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆది నుంచి గొడవ చేస్తున్నాయి. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లకు స్వస్తి చెప్పాలంటూ కూడా డిమాండ్‌ చేశాయి.

ఆపే ప్రసక్తే లేదన్న యోగి
‘రాష్ట్రంలో 1200 ఎన్‌కౌంటర్లు జరగ్గా, వాటిల్లో 40 మంది నేరస్థులు మరణించారు. నేరస్థులను సమూలంగా నిర్మూలించేంత వరకు వీటిని ఆపే ప్రసక్తే లేదు’ అని 2018, ఫిబ్రవరి 14వ తేదీన శాసన మండిలిలో, జీరో అవర్‌లో యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారు జామున కారు ఆపమంటే ఆపలేదన్న కారణంగా ప్రశాంత్‌ చౌధరి నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనను యోగితోపాటు పలువురు మంత్రులు ఖండించినప్పటికీ, ‘తూటాలు నేరస్థులకు మాత్రమే తగులుతాయి’ అంటూ కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు. పోలీసు కాల్పుల్లో ఇంత వరకు సామాన్యులు, నిమ్న కులాల వారే మరణించడంతో వాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అగ్ర కులానికి చెందిన వ్యక్తే కాకుండా ఆపిల్‌ ఉద్యోగి అవడం వల్ల దుమారం రేగుతోంది.

మరిన్ని వార్తలు