గేట్‌కు వచ్చే నెల 1 నుంచే దరఖాస్తులు 

18 Aug, 2018 02:08 IST|Sakshi

మద్రాసు ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహణ 

ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్‌ తప్పనిసరి 

ఈ నేపథ్యంలో ఈసారి పెరగనున్న దరఖాస్తులు 

సాక్షి,హైదరాబాద్‌: ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశాల కోసం గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూట్‌ టెస్టు ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌) నిర్వహణకు ఐఐటీ మద్రాసు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించేలా షెడ్యూలు జారీ చేసింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను (http:// gate.iitm.ac.in)  అందుబాటు లోకి తెచ్చింది. 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈసారి గేట్‌లో స్టాటిస్టిక్స్‌ పేపరును కూడా కేంద్రం ప్రవేశ పెట్టింది. మొత్తంగా 24 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించనుంది.

ప్రతి విద్యార్థి ఒకే పేపరులో పరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును రూ. 1,500గా నిర్ణయించింది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నల్లగొండ, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, కర్నూల్, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మద్రాసు ఐఐటీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈసారి గేట్‌ రాసేందుకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది.  

ఇదీ గేట్‌ షెడ్యూలు.. 
సెప్టెంబరు 1 నుంచి 21వ తేదీ వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 
అక్టోబరు 1వరకు: రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 
నవంబరు 16 వరకు: పరీక్షల కేంద్రాల మార్పునకు అవకాశం (ప్రత్యేక ఫీజు చెల్లింపుతో) 
2019 జనవరి 4: వెబ్‌సైట్‌లో అందుబాటులోకి హాల్‌టికెట్లు 
2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో: గేట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. 
మార్చి 16: ఫలితాలు వెల్లడి.  

మరిన్ని వార్తలు