నేను ఉరి తీస్తా.. ఆమె ఆత్మ శాంతిస్తుంది

4 Dec, 2019 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2012లో డిసెంబర్‌ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్యాచార ఘటన ‘నిర్భయ’ కేసు దోషులకు మరణ శిక్ష ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారి లేకపోవడంతో జైలు అధికారులు టెన్షన్‌ పడుతున్నారన్న వార్తకు స్పందన వచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌ షిమ్లాకు చెందిన రవి కుమార్‌ దేశాధ్యక్షుడు రామనాథ్‌ కోవింద్‌కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ తీహార్ జైలులో ఎగ్జిక్యూటర్ లేనందున తనను తాత్కాలిక తలారిగా నియమించాలని కోరారు. తద్వారా నిర్భయ కేసు దోషులను త్వరలో ఉరి తీయవచ్చు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా మార్చారు. నేరస్థులో ఒకడైన రాంసింగ్ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాల నేరస్థుడు సంస్కరణ గృహంలో ఉన్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడంతో, తీహార్‌ జైలులో ఉన్న వినయ్‌ శర్మ రాష్ట్రపతిని ఆశ్రయించాడు. అయితే దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టవద్దని జాతీయ మహిళా కమిషన్‌ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్‌కు మరణశిక్షను అమలు చేయనున్నారు.

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీ చేసే అవకాశముందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అక్కడ తలారి లేక.. ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనూ పదవీ విరమణ చేసిన తలారీలు ఎవరైనా ఉన్నారా? అని వెతికే పనిలో ఉన్నారు. తలారీని కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 

మరిన్ని వార్తలు