సీఈసీ, ఈసీల నియామకాలకూ కొలీజియం!

24 Oct, 2018 01:23 IST|Sakshi

పరిశీలించనున్న ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), కమిషనర్ల(ఈసీ) నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. పిటిషనర్‌ తరఫు లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్, ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ల వాదోపవాదనలు విన్న తరువాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్‌ల ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది.

సామాజిక కార్యకర్త, న్యాయవాది అనూప్‌ బరన్వాల్‌ 2015లో ఈ పిల్‌ వేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే అధికారాలు, పర్యవేక్షణను ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన నిబంధన 324ను సునిశితంగా పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన అంశాల్ని విచారించే సందర్భంలో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేయొచ్చని ఆర్టికల్‌ 145(3)ని ప్రస్తావించింది.  మరోవైపు, ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలతో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ విభేదించారు.

మరిన్ని వార్తలు