వెంటనే జయ ఆరోగ్యం వివరాలు చెప్పండి: హైకోర్టు

4 Oct, 2016 11:33 IST|Sakshi
వెంటనే జయ ఆరోగ్యం వివరాలు చెప్పండి: హైకోర్టు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేసేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. జయలలిత ఆరోగ్యంపై వైద్యులు వెంటనే వైద్య నివేదికను విడుదల చేయాలని ఆదేశించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య విషయంలో ఆందోళన మొదలైనప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం ఆస్పత్రి బాధ్యత అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులకు ఆదేశించింది.

జ్వరంతోపాటు డీహైడ్రేషన్ కారణంగా సెప్టెంబర్ 22న జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎలాంటి అధికారిక నివేదికను బయటపెట్టలేదు. దీంతో సీఎం జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టులో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈయన ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగించడం ద్వారా రాష్ట్రంలో బహుళ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.

కొనసాగుతున్న ప్రత్యేక పూజలు
అమ్మ(జయలలిత) ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతుండగా మరోపక్క ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆరోగ్యం బాగుపడాలని, సత్వరమే కోలుకోవాలని వినూత్న పూజలు చేస్తున్నారు. ఆలయాల్లోకి బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా మరికొందరు గత కొద్ది రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇంకొందరైతే, అపోలో ఆస్పత్రి ఎదుట అమ్మకోసం ఎదురుచూడటమే కాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని నేలపై అన్నం పెట్టించుకుని తింటున్నారు. ఇంకొందరు శూలాలు గుచ్చుకొని కూడా దీక్షలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు