రాజ్నాథ్​ను కలిసిన ఎంపీ కొత్తపల్లి గీత

24 Sep, 2016 04:47 IST|Sakshi
రాజ్నాథ్​ను కలిసిన ఎంపీ కొత్తపల్లి గీత

న్యూఢిల్లీ: అరకు ఎంపీ కొత్తపల్లి గీత శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న తమ భూమి విషయంలో నెలకొన్న వివాదంపై హోంమంత్రికి వివరించినట్టు ఆమె తెలిపారు. ఆ భూమికి సంబంధించి తమకు అనుకూలంగా హైకోర్టు రెండు ఆర్డర్లు ఇచ్చిందని గీత పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాదారాలను ప్రభుత్వానికి అందించినట్టు ఆమె తెలిపారు. అయితే రెవెన్యూ శాఖ తమ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని కొత్తపల్లి గీత ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని హోం మంత్రిని కోరినట్టు ఆమె తెలిపారు. దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు కొత్తపల్లి గీత పేర్కొన్నారు.

కాగా  హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గంలో అత్యంత విలువైన భూములను దక్కించుకునేందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పీఆర్‌కే రావు అడ్డదారులు తొక్కి, ఇందుకోసం తప్పుడు పత్రాలు సృష్టించారు. రిజిస్ట్రార్‌ను ప్రలోభపెట్టి వాటిని ధ్రువీకరింపజేసుకున్నారు. ఎనిమిది కంపెనీలు పెట్టి భూములను వాటి పేరున బదలాయించుకున్నారు.

నకిలీ సేల్‌డీడ్లు హామీగా పెట్టి రుణం తీసుకుని బ్యాంకునూ మోసం చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు అమ్మారు. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83లో ఉన్న 99.07 ఎకరాల భూములు తమవేనని కొత్తపల్లి గీత చేస్తున్న వాదన అవాస్తవమని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది.

ఈ నెల 12న రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన పహాణీలో ఆ భూములు.. దాని యజమానులు రుక్ముద్దీన్ అహ్మద్, ఆయన కుటుంబ సభ్యుల పేరిటే ఉన్నాయని తేలింది. ఇక పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కొత్తపల్లి గీత పేరిట నిబంధనలకు విరుద్ధంగా రెండు పాన్‌కార్డులు ఉన్న విషయం బయటపడింది.

మరిన్ని వార్తలు