అవును.. బెట్టింగ్‌కు పాల్పడ్డా!

3 Jun, 2018 02:29 IST|Sakshi
థానెలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు వస్తున్న అర్బాజ్‌

పోలీసులకు అర్బాజ్‌ ఖాన్‌ వాంగ్మూలం

రాకెట్‌లో మరో నిర్మాతకూ పాత్ర: బుకీ సోనూ జలన్‌

థానె: గత ఐదారేళ్లుగా క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు బాలీవుడ్‌ నటుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ అంగీకరించారు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌–11వ సీజన్‌లో మాత్రం దాని జోలికిపోలేదని అన్నారు. ఈమధ్యే గుట్టురట్టయిన ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా కేసులో ఆయన శనివారం థానె పోలీసుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు పాల్పడిన దావూద్‌ అనుచరుడు, బుకీ సోనూ జలన్‌ అరెస్టయిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని శుక్రవారం పోలీసులు అర్బాజ్‌కు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. బెట్టింగ్‌ వ్యవహారంలో మే 15న జలన్‌ సహా నలుగురు అరెస్టయ్యారు.

సోనూను విచారిస్తుండగా జలన్‌తో అర్బాజ్‌ ఖాన్‌కున్న సంబంధం, బెట్టింగ్‌ వివరాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్‌లో జలన్‌కు రూ.2.80 కోట్లు కోల్పోయిన అర్బాజ్, ఆ మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో జలన్‌ నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు విచారణలో తేలింది. అటు, బెట్టింగ్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాతకు భాగస్వామ్యముందని పోలీసులకు జలన్‌ వెల్లడించారు. ఆయన కూడా విచారణకు హాజరుకావాలని త్వరలోనే సమన్లు జారీచేస్తామని పోలీసులు తెలిపారు. ఆ నిర్మాత ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సినీ నిర్మాణ, పంపిణీ కంపెనీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.  

బెట్టింగ్‌ వల్లే మలైకాతో విడాకులు!
బెట్టింగ్‌ వ్యసనమే అర్బాజ్‌ వైవాహిక జీవితాన్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో పాల్గొనవద్దని భార్య మలైకా అరోరా ఎంత నచ్చజెప్పినా అర్బాజ్‌ పెడచెవిన పెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికే దెబ్బతిన్న వారి సంబంధాలు బెట్టింగ్‌ వల్ల మరింత క్షీణించాయని వెల్లడించాయి. సోదరులు సల్మాన్‌ఖాన్, సొహైల్‌ ఖాన్‌లు కూడా అర్బాజ్‌ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిసింది. విడిపోతున్నామని 2016లోనే ప్రకటించిన అర్బాజ్‌–మలైకా దంపతులకు గతేడాది నవంబర్‌లో విడాకులు మంజూరయ్యాయి. తమ విడాకులపై వచ్చిన పలు కట్టుకథలను వారు ఖండించారు. విడిపోయిన తరువాత కూడా వారిద్దరు 15 ఏళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగానే మెలుగుతున్నారు.
 

మరిన్ని వార్తలు