రాముడి వారసులున్నారా?

10 Aug, 2019 04:09 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం–బాబ్రీమసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీరాముడి సంతతికి చెందిన రఘువంశం వారు అయోధ్యలో ఎవరైనా ఉన్నారా? అని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తరఫు న్యాయవాది పరాశరన్‌ను ప్రశ్నించింది. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని పరాశరన్‌ వాదించారు.

ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పందిస్తూ..‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్‌ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్‌నాథ్‌ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్‌ తెలిపారు.

రోజువారీ విచారణ సాగుతుంది
అయోధ్య భూ వివాదం కేసులో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు రోజువారీ విచారణ చేపట్టడంపై సున్నీ వక్ఫ్‌ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ వ్యతిరేకించారు. ఇంతవేగంగా విచారణ జరపడం వల్ల సంబంధిత పత్రాలను అధ్యయనం చేసి విచారణకు సిద్ధం కావడం కష్టంగా ఉందని కోర్టుకు విన్నవించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు