ఇక దాగుడుమూతలుండవ్‌!

1 Oct, 2019 03:05 IST|Sakshi

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడనంత కాలమే నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)కు కట్టుబడి ఉంటామని, దానిని దాటి వెళ్లడం భారత్‌కు ఏమాత్రం కష్టం కాదనే విషయాన్ని పాక్‌కు సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా హెచ్చరికలు పంపామని ఆర్మీచీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వూ్యలో ఆయన.. ‘ఇకపై దాగుడుమూతల ఆటలు ఉండబోవు. భారత్‌ తలుచుకుంటే సైన్యం, వైమానిక దళం ఏదైనా కావచ్చు లేదా ఈ రెండింటికీ సరిహద్దులు దాటి వెళ్లి దాడి చేసే సామర్థ్యముంది. ఈ విషయాన్ని 2016లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ రూపంలో చూపించాం’అని తెలిపారు. ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న పాక్‌ భారత్‌పై జిహాద్‌కు పిలుపునిచ్చిందని ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇవ్వడం పాక్‌ విధానంగా మారిందన్నారు.

యుద్ధం మొదలైతే అది అణు యుద్ధానికి దారి తీస్తుందంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ చేస్తున్న హెచ్చరికలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధాలను నివారించడానికే అణ్వాయుధాలు తప్ప పోరాటం కోసం కాదని తెలుసుకోవాలన్నారు. ‘అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ చేసే ప్రకటనలను అర్థం చేసుకోవడం కష్టం. ఇలాంటి సందర్భాల్లో అణ్వస్త్రాలను ప్రయోగించడానికి అంతర్జాతీయ సమాజం అంగీకరిస్తుందా? వ్యూహాత్మకమైన అణ్వాయుధాలను ఎప్పుడు, ఎందుకు ఉపయోగించాలో అవగాహన లేని వారే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు’అని జనరల్‌ రావత్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌ వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాక్‌ పాల్పడే కుయుక్తులను సాగనీయమన్నారు. కశ్మీరీ యువతను నిర్బంధించినట్లు పాక్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయన .. హింసాత్మక చర్యలకు పాల్పడే వారు, రాళ్లు రువ్వే వారినే అదుపులోకి తీసుకున్నాం. వారిలో చాలామందిని ఇప్పటికే విడిచిపెట్టాం’అని తెలిపారు. కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం తమ మంచికేనని చాలా మంది భావిస్తున్నారన్నారు.  

మరిన్ని వార్తలు