ఆపరేషన్‌ నమస్తే

28 Mar, 2020 05:51 IST|Sakshi

కరోనాపై పోరుకు సైన్యం ప్రత్యేక కార్యక్రమం 

ప్రకటించిన ఆర్మీ చీఫ్‌ నరవాణే

న్యూఢిల్లీ/చండీగఢ్‌: కరోనా వైరస్‌ విస్తృతి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవాణే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఆపరేషన్‌ నమస్తే అనే ఈ కార్యక్రమంలో కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయం అందించడంతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లోని 13 లక్షల మంది సైనికులు, వారి కుటుంబాలు వైరస్‌ బారిన పడకుండా చర్యలు తీసుకోనున్నారు.

సైనిక సిబ్బంది తమ క్లిష్టమైన విధుల దృష్ట్యా సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని, అందుకే సాధ్యమైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘మీ కుటుంబాల సంక్షేమం గురించి మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సరిహద్దులోని జవాన్లకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మేం విజయం సాధిస్తాం’ అని తెలిపారు. ఆపరేషన్‌ నమస్తేలో భాగంగా ప్రత్యేకంగా కమాండ్ల వారీగా సాయం అందించేందుకు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు పలు సూచనలు జారీ చేసింది. అదేవిధంగా, కరోనా వైరస్‌ అనుమానిత కేసుల కోసం ఆర్మీ వెస్టర్న్‌ కమాండ్‌ పంజాబ్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల్లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా బారినపడిన సైనిక సిబ్బందికి, ప్రజలకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను 28 సైనికాస్పత్రుల్లో సిద్ధం చేసింది.

కేంద్రానికి నోటీసులు...
ఇరాన్‌కు తీర్థయాత్రకు వెళ్లిన 850 మందిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో ఇరాన్‌లోని క్వోమ్‌ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించాలంటూ లదాఖ్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన 580 మంది కశ్మీర్‌ వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలను తెలపాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా