పాక్‌కు ఆర్మీ చీఫ్‌ వార్నింగ్‌

25 May, 2018 19:32 IST|Sakshi
ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపి హింసను ప్రేరేపించడాన్ని పాకిస్తాన్‌ నిలిపివేయాలని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెచ్చరించారు. పాకిస్తాన్‌ శాంతి, సామరస్యాలను కాంక్షిస్తే తక్షణం ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి స్వస్తి పలకాలని అన్నారు. జమ్ము కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగితే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేతను పొడిగించే అవకాశం ఉందని రావత్‌ పేర్కొన్నారు. అయితే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దుందుడుకు చర్యలు చేపడితే భద్రతా దళాలు దీటుగా బదులిస్తాయని హెచ్చరించారు.

భారత్‌ సరిహద్దుల్లో శాంతిని కాంక్షిస్తోందని, అయితే పాకిస్తాన్‌ మాత్రం వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఫలితంగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పాక్‌ కవ్వింపులకు పాల్పడితే తాము ప్రతిస్పందిచాల్సివస్తుందని, చేతులు ముడుచుకుని కూర్చోలేమని ఆయన స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణం మనగలగాలంటే సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడాల్సిందేనని చెప్పారు. రంజాన్‌ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత కార్యక్రమానికి భద్రతా దళాలు నెలరోజుల పాటు విరామం ప్రకటించాయి.

మరిన్ని వార్తలు