పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం

12 Jan, 2020 04:41 IST|Sakshi

ఆర్మీ చీఫ్‌ నరవాణే వ్యాఖ్య

న్యూఢిల్లీ: ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) మొత్తం భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఎప్పుడో తీర్మానం చేసింది. ఒకవేళ ఆ భూభాగం మళ్లీ మన స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తే కచ్చితంగా ఆ విషయంపై చర్యలు చేపడతాం’ అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవాణే స్పష్టం చేశారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 13 లక్షల మంది ఉన్న ఆర్మీ.. రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. పీఠికలోని విషయాలకు లోబడి ఉంటుందన్నారు.

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ గ్రేట్‌..
త్రివిధ దళాలన్నింటినీ సమన్వయ పరిచేందుకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నరవాణే చెప్పారు. ఇది విజయవంతం అయ్యేందుకు ఆర్మీ తరఫున సహాయసహకారాలు అందిస్తామన్నారు. భారత సైన్యం పాక్‌లా దొంగ దెబ్బ తీయదని, నైపుణ్యంతోనే పని చేస్తుందని చెప్పారు. నైతిక విలువలకు సైన్యం కట్టుబడి ఉంటుందన్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేలను మూడింటినీ సమన్వయం చేస్తూ.. మిలటరీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఏకైక సలహాదారుగా సీడీఎస్‌ వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

ఓ కన్నేసి ఉంచాలి..
ఆర్మీకి సైనికులే బలమని నరవాణే చెప్పారు. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, ఎలాంటి వారు ఉన్నారన్నదే తమ మంత్రమని చెప్పారు. ఇదే సైనిక ఆయుధాలకూ వర్తిస్తుందన్నారు.  భారత బలగాలు సియాచిన్‌ ప్రాంతంలో ఓ కన్నేసి ఉంచాలని నరవాణే వ్యాఖ్యానించారు. పాక్, చైనాల మధ్య ఈ ప్రాంతం గురించి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు