సీఏఏ ఆందోళనలపై ఆర్మీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్య

27 Dec, 2019 03:00 IST|Sakshi

హింసకు నేతలే కారణం

న్యూఢిల్లీ/కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏను ఉపసంహరించుకునే దాకా నిరసనలను ఆపేది లేదని బెంగాల్‌ సీఎం మమత అన్నారు.

అది నాయకత్వ లక్షణం కాదు
‘సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నిరసన కారుల్లో ఎక్కువమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ప్రజలను హింసకు ప్రేరేపించడం నాయకత్వ లక్షణం కాదు’అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాయకుడంటే సరైన దిశలో నడిపించేవాడు. మంచి సూచనలిస్తూ మన సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. అతడు ముందు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు. అయితే, ఇది అనుకున్నంత సులువు కాదు.

చాలా క్లిష్టమైన వ్యవహారం.’అని తెలిపారు. అయితే, రాజకీయ పరమైన వ్యవహారాల్లో జనరల్‌ రావత్‌ తలదూర్చడం కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. ‘ఆయన చెప్పింది నిజమే. అయితే, ప్రధాని పదవిపై ఆశతోనే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది’ అని ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ సైనికాధికారులకు మాత్రమే ఉంటుంది. ఆయనకు ఇలాగే మాట్లాడే అవకాశం ఇస్తే సైనిక తిరుగుబాటుకు కూడా దారిచూపినట్లవుతుంది’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి బ్రిజేష్‌ కాలప్ప ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

జనరల్‌ రావత్‌ తన పరిధి తెలుసుకోవాలని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘జనరల్‌ రావత్‌తో ఏకీభవిస్తున్నా. మత విద్వేషాలు రెచ్చగొట్టి, రక్తపాతానికి పాల్పడిన వారు కూడా నాయకులు కాదుకదా?’అని ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా జనరల్‌ రావత్‌ వ్యాఖ్యలను ఖండించింది. ఈ పరిణామంపై ఆర్మీ స్పందించింది. ఆర్మీచీఫ్‌ వ్యాఖ్యలు కేవలం సీఏఏ ఆందోళనలనుద్దేశించి చేసినవి కావని పేర్కొంది. ఆయన ఏ రాజకీయ పార్టీని కానీ, వ్యక్తిని కానీ ప్రస్తావించలేదు.  విద్యార్థులను గురించి మాత్రమే జనరల్‌ రావత్‌ మాట్లాడారు. కశ్మీర్‌ లోయకు చెందిన యువతను వారు నేతలుగా భావించిన వారే తప్పుదోవపట్టించారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 31వ తేదీతో రావత్‌ పదవీ కాలం ముగియనుంది.

ఆందోళనలు ఆపేదిలేదు: మమతా బెనర్జీ
పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని ఉపసంహరించుకోనంత కాలం ఆందోళనలను కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.సీఏఏకి వ్యతిరేకంగా గురువారం సెంట్రల్‌ కోల్‌కతాలో ఆమె భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనలను కొనసాగించాలని విద్యార్థులను కోరారు. ‘మీరు దేనికీ భయపడకండి. మీకు అండగా నేనుంటా. నిప్పుతో ఆటలు వద్దని బీజేపీని హెచ్చరిస్తున్నా’అని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై పోరాడుతున్న జామియా మిల్లియా, ఐఐటీ కాన్పూర్‌ తదితర వర్సిటీల విద్యార్థులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు తిండి, బట్ట, నీడ ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను కనిపెట్టే పని మాత్రం చేపట్టిందన్నారు.

ప్రతిపక్షాలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయి
సీఏఏపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు అయోమయం సృష్టిస్తున్నాయని హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(డీడీఏ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్‌ షా ప్రసంగించారు. ‘పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఒక్క ప్రతిపక్ష నేత కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ చట్టంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ ఢిల్లీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.కాగా కాంగ్రెస్‌ నేత చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)తో, 2010నాటి ఎన్పీఆర్‌కు పోలికే లేదన్నారు. ఎన్నార్సీతో సంబంధం లేకుండా, 2010 నాటి ఎన్పీఆర్‌ చేపట్టాలని తమ పార్టీ కోరుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ దురుద్దేశంతో దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు.

సీఏఏకు వ్యతిరేకంగా గురువారం మైసూరులో జరిగిన భారీ ప్రదర్శన

మరిన్ని వార్తలు