ఫేస్‌బుక్‌ బ్యాన్‌: కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి

13 Jul, 2020 16:50 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత ఆర్మీలో పనిచేసే అధికారులు, సైనికులు ఫేస్‌బుక్‌తో పాటుగా  89 యాప్‌లను వారి ఫోన్‌ల నుంచి తొలగించాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ ఆర్మీ అధికారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వివరాలల్లోకి వెళితే.. భద్రతా కారణాలు, డేటా లీకేజీ దృష్ట్యా 89 యాప్‌లు వాడటంపై నిషేధం విధిస్తూ ఇటీవల ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి వ్యతిరేకంగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ పీకే చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం రోజున ఈ పిటిషన్‌ విచారణ వచ్చే అవకాశం ఉంది. (క‌రోనా: అవి వాడాకా ఒక్కరు కూడా చనిపోలేదు)

ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయం భావ‌ ప్రకటన స్వేచ్ఛ‌కు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చౌదరి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘సైనికులు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో రిమోట్‌ ఏరియాలల్లో సేవలు అందిస్తుంటారు. వారికి నిత్యం శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. ఇటువంటి వృత్తిపరమైన ఇబ్బందులు పలు సందర్భాలల్లో సైనికులు ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణమవుతున్నాయి. మరోవైపు సుదూర ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉండటానికి ఫేస్‌బుక్‌ లాంటి యాప్స్‌ ఉపయోగపడుతున్నాయి. కుటుంబ సమస్యలు చర్చించుకోవడానికి వేదికగా పనిచేస్తున్నాయి’అని చౌదరి తెలిపారు. (గహ్లోత్‌కు మద్దతు ప్రకటించిన సీఎల్పీ)

ప్రజా సేవలో ఉన్న నాయకులు, అధికారులు సైనికుల వద్ద కన్నా పెద్ద మొత్తంలో రహస్య సమాచారాన్ని కలిగి ఉంటారని చౌదరి అన్నారు. మరీ అలాంటి వ్యక్తులకు ఈ నిబంధనలు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ జూన్‌ 6వ తేదీన జారీచేసిన ఈ నిబంధనలను వెనకక్కి తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు