‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’

19 Feb, 2019 12:12 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఆర్మీ అధికారి థిల్లాన్‌

ఉగ్రవాదులకు ఆర్మీ, కశ్మీర్‌ పోలీసు వర్గాల హెచ్చరికలు

శ్రీనగర్‌ : కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలని, లేదంటే చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ప్రతీ ఒక్కరిని అంతం చేస్తామని ఆర్మీ అధికారి కన్వాల్‌ జీత్‌సింగ్‌ థిల్లాన్‌ హెచ్చరించారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ను ఆనవాలు కశ్మీర్‌ లోయలో కనిపించకుండా చేస్తామని పేర్కొన్నారు. పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్‌ హస్తం ఉందని స్పష్టమైందని, దీనికి పాక్‌ సహకారం ఉందని వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సోమవారం నాటి ఎన్‌కౌంటర్‌లో దాడి కీలక సూత్రధారి, జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.(పుల్వామా ఉగ్రదాడి‌; మాస్టర్‌ మైండ్‌ హతం!)

ఈ క్రమంలో ఆర్మీ అధికారులు, కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఎన్‌కౌంటర్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా... 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి బాధ్యులను 100 గంటల్లోనే అంతం చేశామని పేర్కొన్నారు. ‘ ఉగ్ర సంస్థలో ఉన్న, చేరాలనుకున్న ఎవరైనా సరే లొంగిపోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా. తుపాకీ వదిలేయమని కుటుంబ సభ్యులైనా వారికి సూచిస్తే మంచింది. అలా జరగని పక్షంలో వారిని కోల్పోవాల్సి ఉంటుంది. కశ్మీర్‌ నుంచి వారిని పూర్తిగా తొలగిస్తాం. మీరకుంటున్నట్లుగా లొంగిపోయే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. లేదంటే అంతం చేయడానికి మేము సిద్ధం’ అంటూ థిల్లాన్‌ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రాణాలతో తిరిగి వెళ్లరు..
పుల్వామా దాడికి ప్రణాళిక పాకిస్తాన్‌లోనే జరిగిందని కశ్మీర్‌ ఐజీ ఎస్పీ పంత్‌ తెలిపారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే తమ లక్ష్యమని... కశ్మీర్‌లో అడుగుపెట్టిన ఉగ్రవాదులు ప్రాణాలతో తిరిగి వెళ్లరని హెచ్చరించారు. పాక్‌ నుంచి వచ్చే ఉగ్రవాదులు కనిపించగానే కాల్చి పారేస్తామని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు