కర్ణన్‌ చేతికి అరెస్టు వారెంట్‌

18 Mar, 2017 04:14 IST|Sakshi
కర్ణన్‌ చేతికి అరెస్టు వారెంట్‌

- న్యాయమూర్తి ఇంటికెళ్లి అందించిన డీజీపీ
- తిరస్కరించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి


కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ను పశ్చిమబెంగాల్‌ డీజీపీ సుర్జిత్‌కర్‌ శుక్రవారం అందజేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్, డీఐజీ (సీఐడీ) రాజేష్‌కుమార్‌తో కలసి ఇక్కడి కర్ణన్‌ ఇంటికి వెళ్లిన డీజీపీ... వారంట్‌ను ఆయన చేతికిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

కాగా, డీజీపీ అరెస్టు వారంట్‌ ఇచ్చిన కాసేపటికే దాన్ని తిరస్కరిస్తున్నట్టు జస్టిస్‌ కర్ణన్‌ ప్రకటించారు. ‘ఓ దళిత జడ్జిని వేధింపులకు గురిచేస్తూ మీరు తీసుకుంటున్న ఇలాంటి కించపరిచే చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధం. కోర్టుల గౌరవ మర్యాదలను కాపాడేందుకు ఇకనైనా ఈ వేధింపులు ఆపమని అభ్యర్థిస్తున్నా’అని సీజే సహా తనకు అరెస్టు వారంట్‌ జారీ చేసిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్‌ కర్ణన్‌ లేఖ రాశారు.

మద్రాస్‌ హైకోర్టులోని కొందరు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారంటూ జస్టిస్‌ కర్ణన్‌ ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖెహర్‌కు లేఖలు రాసిన నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఈ నెల 10న జస్టిస్‌ కర్ణన్‌కు కోర్టు ధిక్కారం కింద బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీచేసింది. మార్చి 31 లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. సిట్టింగ్‌ హైకోర్టు జడ్జిపై అరెస్టు వారెంట్‌ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, దళితుడిని కనుకనే తనపై దాడి చేస్తున్నారని కర్ణన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనపై అరెస్టు వారంట్‌ ఇచ్చిన సీజే, మరో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అధికార దుర్వినియోగం కింద విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆయన సీబీఐని కూడా ఆదేశించారు.

రూ.14 కోట్లు నష్టపరిహారం ఇవ్వండి...
అరెస్టు వారంట్‌ ఇచ్చిన చీఫ్‌ జస్టిస్‌ ఖెహర్‌ సహా ఏడుగురు న్యాయమూర్తుల సుంప్రీంకోర్టు ధర్మాసనంపై కర్ణన్‌ తీవ్రంగా స్పందించారు. తనను న్యాయ సంబంధిత, పరిపాలనా పనులు చేసుకోనివ్వకుండా నియంత్రించినందుకు గానూ రూ.14 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని ధర్మాసనంలోని ఏడుగురు న్యాయమూర్తులకు గురువారం లేఖ రాశారు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన ధర్మాసనాన్ని రద్దు చేసి, తన రోజువారీ పనిని చేసుకోనివ్వాలని కోరారు. ‘ఈ ఏడుగురు జడ్జీలూ మార్చి 8 నుంచి నన్ను న్యాయ, పరిపాలనా పనులు చేసుకోకుండా అడ్డుకున్నారు.  సాధారణ జీవితంతో పాటు కోట్ల మంది భారతీయుల ముందు అవమానించినందుకు ధర్మాసనంలోని ఆ జడ్జీలూ ఈ ఆదేశాలను అందుకున్న వారం లోగా రూ.14 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు